mt_logo

ఖమ్మంలో క్యాథల్యాబ్, ఎమర్జెన్సీ యూనిట్ ప్రారంభించిన మంత్రి హరిశ్ రావు

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని మంత్రి హరీశ్‌ రావు గారు అన్నారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 20 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ ల్యాబ్, ఎమర్జెన్సీ యూనిట్, 100 పడకల ట్రామా కేర్ సెంటర్, తల్లి పాల నిల్వ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… రెండో వేవ్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫీవర్‌ సర్వే దేశానికే ఆదర్శంగా నిలించిందని చెప్పారు. ఇప్పటివరుకు 29 జిల్లాల్లో 77 లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే పూర్తయిందని, అవసరమైన వారికి మెడికల్‌ కిట్లు అందిస్తున్నామని తెలిపారు. మరో కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. మూడో వేవ్‌లో 86 దవాఖానల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు.

ఖమ్మం దవాఖానలో క్యాథ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నిలోఫర్‌ దవాఖాన తర్వాత ఖమ్మంలోనే తల్లిపాల నిల్వ కేంద్రం ఉందన్నారు. ఇప్పటివరకు వరంగల్‌ ఎంజీఎంలో క్యాథ్‌ ల్యాబ్‌ అందుబాటులో ఉందని, త్వరలో ఆదిలాబాద్‌ లో కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గిరిజన ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అత్యాధునిక సేవలు అందిస్తున్నామని, గుండె సంబంధిత వ్యాధులకు డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచామని తెలియజేశారు. త్వరలోనే ఖమ్మంలో గుండె ఆపరేషన్లు ప్రారంభిస్తామన్నారు. అలాగే మధిర, సత్తుపల్లిలో వంద పడకల దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖమ్మంలో ఎంఆర్‌ఐ సౌకర్యం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునీకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. హైదరాబాద్‌ తరహాలో ఖమ్మంలో కూడా బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని తెలిపారు. వ్యాక్సినేషన్‌లో ఖమ్మం జిల్లా ముందంజలో ఉండటం అభినందనీయం అని మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *