సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు పైగా ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలపై చర్చించారు. దేశంలో జాతీయ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యత, గుణాత్మక మార్పు రావడానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఆవశ్యకతపై సీఎం కేసీఆర్ ఉండవల్లికి వివరించారు. జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా, వివిధ రంగాల్లో జరుగాల్సిన అభివృద్ధికి సంబంధించి ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు, నిపుణులు, నాయకులతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉండవల్లితో సీఎం వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. దేశంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరూ చర్చించారు. జాతీయ స్థాయిలో తాను ముందుకు వెళ్లాలని పలు వర్గాల నుంచి సూచనలు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఉండవల్లి అభిప్రాయాలను కూడా సీఎం కేసీఆర్ తెలుసుకొన్నారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లితో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. త్వరలోనే ఇద్దరి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.