దేశవ్యాప్తంగా డిజిటల్ కేసుల పరిష్కారానికి తెలంగాణ పోలీసులే నాయకత్వం వహిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. టీఎస్ పీఏ(తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ)లో డార్క్ వెబ్ ఇన్విస్టిగేషన్‌పై ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌నకు దేశ నలుమూలల నుంచి పలువురు పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు, నిఘా ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ… సైబర్ నేరాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని, నేరగాళ్లు డార్క్‌వెబ్, హ్యాకింగ్, క్రిప్టో కరెన్సీ నేరాలకు అధునాతన పద్ధతుల్లో పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ నేరాలను పరిశోధించడం, నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు సంస్థలకు డిజిటల్ భూ భాగంలో ఇన్నో ఇబ్బందులు ఉన్నాయన్నారు. వీటిని ఎదుర్కోవడంలో భాగంగా తెలంగాణ ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్, యూకే పోలీస్ విభాగంలో 40 ఏండ్లు పనిచేసిన మాజీ పోలీసు అధికారి మార్క్ బెంట్లీ భాగస్వామిగా ఉన్న ఇన్నోవేషన్ ల్యాబ్స్‌తో కలిసి ఈ శిక్షణను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ మోసాలలో భాగమైన రుణ యాప్‌ల వేధింపులు కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నాయని, ఇందుకు కారకులైన నేరగాళ్లను పట్టుకోవడం కష్టంగా మారుతున్నదని అన్నారు. వేధింపులకు పాల్పడే నేరగాళ్లలో కొందరు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉంటున్నారని తెలిపారు. ఇటీవల మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్, ఎక్స్‌సిలికా పేమెంట్ గేట్‌వే హ్యాకింగ్ కేసులను ఛేదించామన్నారు. ఇలాంటి కేసులు దర్యాప్తు చేయడంలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారితో తగిన వనరులు కూడా అవసరమన్నారు. ప్రస్తుతం పలు అంశాలపై ఐదు రోజుల వర్స్‌షాప్‌లో నిపుణులు శిక్షణ ఇస్తున్నారని సీపీ పేర్కొన్నారు.