సోమవారం అర్థరాత్రి హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో మూసి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం నగరంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చాదర్ ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిల వద్ద మూసీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. బాపూ ఘాట్, శంకర్ నగర్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. బల్దియా సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో ఎప్పటికప్పుడు నీరు పోయేలా చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ హెచ్చరించింది.