టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో పార్టీ ప్లీనరీ జరగనుంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో 40 ఫీట్ల టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి కేక్ కట్ చేశారు. భారీగా తరలి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలతో, బాణాసంచా పేలుళ్లతో, తెలంగాణ పాటలతో తెలంగాణ భవన్ హోరెత్తింది. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా ఆహ్వానితులంతా పార్టీ ప్లీనరీ సమావేశ వేదిక వద్దకు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభిస్తారు. ఆ వెంటనే కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. ప్లీనరీకి మూడువేల మంది ప్రతినిధులు హాజరవుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్లీనరీకి అహ్వానం అందనివారు బాధ పడవద్దని, ఈసారి ప్రజా ప్రతినిధులకు మాత్రమే ఆహ్వానాలు పంపామని చెప్పారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, పట్టణాల పార్టీ అధ్యక్షులు, జిల్లాల లైబ్రరీ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వనించామని వెల్లడించారు.