mt_logo

అవమానాలకు తగిన మూల్యం చెల్లించుకుంటారు.. కేంద్రాన్ని హెచ్చరించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ధాన్యం సేకరణపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర మంత్రుల బృందానికి శుక్రవారం కూడా కేంద్రం నుండి సమాధానం రాలేదు. శుక్రవారం వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో చర్చల కోసం వేచి చూసిన మంత్రులు, టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాల సమాహారం కానీ కేంద్రం రాష్ట్రాలను రాజ్యాంగ బద్దంగా ఎన్నికైనట్లుగా చూడడం లేదు. కేవలం కేంద్రప్రభుత్వ దయా, దక్షిణ్యాల మీద రాష్ట్రాలు నడవాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిది కాదు. గతంలో రాష్ట్రాల అభిలాశలను అవమానపరిచినవారు తగిన మూల్యం చెల్లించుకున్నారు. మళ్ళీ అలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే’ అని స్పష్టం చేసారు.

‘కో ఆపరేటివ్ ఫెడరలిజం తెస్తామని చెబుతూ ఉంటారు. అవి కేవలం మాటల వరకే. నీతి ఆయోగ్ సిఫార్సులను కూడా కేంద్రప్రభుత్వం పాటించడం లేదు. వారికి నచ్చిన రాష్ట్రాలకు, వారి పార్టీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతీ అంశంలోనూ కేంద్రం వైఖరి ఇలాగే ఉంది. గుజరాత్ కు వరదలు వచ్చినప్పుడు ఆఘమేఘాల మీద నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు ఎలా స్పందించారో దేశం మొత్తం గమనించింది. గతంలో కూడా అఖండ మెజారిటీ వచ్చిన ప్రభుత్వాలు.. అతిగా చేసినప్పుడు పడిపోయాయి. రాష్ట్రాలను, ముఖ్యమంత్రుల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోంది. ధాన్యం కనీస మద్దతు ధర నిర్ణయం, ఎగుమతులు, గోడౌన్లు, రైల్వేలు కేంద్రం చేతిలోనే ఉంటాయి. అవసరంలో అడిగితే మాత్రం మా పరిధిలో లేదు అని చేతులు ఎత్తేస్తున్నారు. రైతుల ఆదాయం రెండింతల రెట్టింపు చేస్తామని హామీలు ఇచ్చారు కానీ ఇపుడు రైతులు పండించిన పంటను ఇండియాగేట్ వద్ద పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కొత్త దారులు వెతకరు, పరిశోధనలు చేయరు. భారత భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా క్రాప్ కాలనీలు చేస్తే దేశానికి బాగుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చెయ్యరు. 80, 90 వేల కోట్ల రూపాయల విదేశీ ధనం వెచ్చించి వంట నూనెలు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. కానీ దేశ రైతులకు వంట నూనెలు పండించే దారి చూపడం లేదు. 140 కోట్లా జనాభా నైపుణ్యాన్ని నిరుగారుస్తున్నారు.
రైతుల ఉత్పత్తులను చిన్నచూపు చూసి దేశాన్ని తిరోగమనం దిశగా నడుపుతున్నారు. దేశంలో పప్పు దినుసుల కొరత ఉంది. ఉపన్యాసలు ఇచ్చి అదే దేశభక్తి అని చెబుతున్నారు. కానీ మూడు పూటలా ప్రజల కడుపు నిండితేనే దేశభక్తి. వ్యవసాయ రంగంపై కేంద్రం చూపు హానికరంగా.. ప్రమాదకరంగా ఉంది. ఆరుగాలం కష్ట పడ్డ రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఒక రాష్ట్రం వచ్చి ఢిల్లీలో ఎదురుచూస్తుంటే చులకనగా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞతను చూస్తున్నాం. ఇది రాజకీయంతో చూసే అంశం కాదు. తెలంగాణాలో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లను కొనసాగిస్తాం. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ లేఖ కోసం వేచి చూస్తాం’ అని మీడియా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *