టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 50 లక్షలు దాటిపోయిందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చి సభ్యత్వ నమోదు ప్రక్రియ పరిశీలించి స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వచ్చిందని, ఊహించిన దానికన్నా ప్రజలనుండి ఆదరణ లభించిందని, వెల్లువలా వచ్చిన ఈ సభ్యత్వాలు తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనకు తార్కాణంగా నిలిచాయని అన్నారు. అంతేకాకుండా చదువుకునే విద్యార్థులు సైతం ఉత్సాహంగా సభ్యత్వాలు స్వీకరించారని, ప్రస్తుత సభ్యత్వాల ద్వారా పార్టీకి ఇప్పటివరకు రూ.5 కోట్లు సమకూరాయని, సభ్యులందరికీ ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా భీమా సౌకర్యం కల్పిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
సభ్యత్వాల కంప్యూటరీకరణ, క్రియాశీల సభ్యత్వాల్లో ఫొటోల స్కానింగ్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని సభ్యత్వ ప్రక్రియను ఈనెల 28 వరకు పొడిగించినట్లు చెప్పారు. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చేశామని, మర్చి 5 వ తేదీనుండి 20 వరకు గ్రామ, 24 నుండి మండల కమిటీల ఎన్నికల నిర్వహణ జరుగుతుందని, ఏప్రిల్ 24న ఎల్బీ స్టేడియంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుపుకుని 27న పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సీఎం చెప్పారు.