mt_logo

మే 14న ఎంసెట్ పరీక్ష..

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఈనెల 25న విడుదలకానుంది. 28 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష మే 14న జరుగుతుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ప్రవేశాల్లో 15 శాతం ఓపెన్ మెరిట్ కోటా ఉంటుంది. ఆ కోటా కింద ప్రవేశాలు కోరే ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ పరీక్ష తప్పనిసరిగా రాయాల్సిఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో పరీక్షా కేంద్రాలు ఉండవు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ టీ పాపిరెడ్డి, ఎంసెట్ కమిటీ చైర్మన్ శైలజా రామయ్యర్, కన్వీనర్ రమణారావు తదితరులు శుక్రవారం సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశం అనంతరం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఎంసెట్ కు సంబంధించి పలు అంశాలను వారు మీడియాకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ఎంసెట్-2015 ను నిర్వహిస్తున్నామని, దరఖాస్తులు ఆన్ లైన్ లోనే స్వీకరిస్తామని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250 గా నిర్ణయించామని, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, ఆక్సిస్ బ్యాంకుల ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించే వీలుందని చెప్పారు. టీఎస్ ఆన్ లైన్, ఏపీ ఆన్ లైన్, ఈ-సేవ, మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చని, ఈ నెల 28 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 9వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము ఉండదని, గడువు తర్వాత రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు, రూ.1000 తో ఏప్రిల్ 22, రూ.5 వేలతో మే 5, రూ.10 వేల లేట్ ఫీజుతో మే 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ అప్లికేషన్ డాటాలో మార్పులు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకు గడువు ఉంటుంది. మే 8 నుండి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మే 14వ తేదీ ఉదయం 10 గంటలనుండి 1 గంట వరకు ఇంజినీరింగ్, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మే 16 న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, కీపై వచ్చిన అభ్యంతరాలను మే 23వరకు స్వీకరిస్తామని, మే 28న ఎంసెట్ ర్యాంకులు విడుదల చేస్తామని చెప్పారు. ఎంసెట్ మార్కులకు 75శాతం, ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ లెక్కించి ఎంసెట్ ర్యాంకులు విడుదల చేస్తామని ఎంసెట్ కన్వీనర్ రమణారావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *