మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు హాజరైన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తూ, నారాయణ్ ఖేడ్ ను దత్తత తీసుకుంటానని, మీ సమస్యలు తీర్చే బాధ్యత నాదని అన్నారు. నారాయణ్ ఖేడ్ పై గులాబీ జెండా ఎగరేయాలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణను 40 ఏళ్ళు కాంగ్రెస్, 20 ఏళ్ళు టీడీపీ పాలించినా తెలంగాణ అభివృద్ధికోసం ఏనాడూ పట్టించుకోలేదని, ఎవరిచేతిలో పెడితే తెలంగాణ సురక్షితంగా ఉంటుందో ఆలోచించి ఓటువేయాలని, మనతలరాతను మనమే రాసుకోవాలని సూచించారు.
అధికారంలోకి రాగానే లంబాడీతండాలను, గిరిజనగూడెం లను గ్రామపంచాయితీలుగా మారుస్తామని, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కలిసి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కేసీఆర్ కోరారు. అనంతరం జోగిపేటలో బహిరంగసభకు కేసీఆర్ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఆందోల్ నియోజకవర్గ అభ్యర్థి, సినీ నటుడు బాబూమోహన్, భారీగా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.