mt_logo

వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రచారసభ

వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. టీడీపీ పార్టీ మన పార్టీ కాదని, ఆంధ్రా పార్టీ అని, ఎంతో కష్టపడి 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఎవరిచేతిలో పెడితే అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించి ఓటువేయాలని సూచించారు. ఈనెల 30న జరగనున్న ఎన్నికలు మామూలు ఎన్నికలు కాదని, చారిత్రక నేపథ్యం ఉన్న ఎన్నికలని, ఓటు వేయడంలో చిన్న పొరపాటు చేసినా తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రజలను హెచ్చరించారు.

తెలంగాణలో మూడేళ్ళు కరెంటు కష్టాలు తప్పవని, మూడేళ్ళ తర్వాత 24గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించిన నరేంద్రమోడీ ఒక పిచ్చి దూగ అని, తెలంగాణ ఉద్యమం గురించి అసలు తెలియదని, ఆంధ్రా బాబులపక్కన కూర్చుని మోడీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మంచిదికాదని హెచ్చరించారు. ‘తెలంగాణ ఏర్పడిన రోజు భరతమాత ఏడవలేదు. సంతోషించింది. తెలంగాణలో ఎంతమంది తల్లుల పుస్తెలు తెగిపోయాయో తెలుసా? ఎంతమంది బిడ్డలు చనిపోయారో తెలుసా?’ అని ప్రశ్నించారు.

తెలంగాణ అధికారంలోకి రాగానే స్టేషన్ ఘన్‌పూర్‌లో మొదటివిడతగా 5వేల ఇండ్లు మంజూరుచేస్తామని, మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని అంశాలనూ అమలయ్యేలా చేస్తామని తెలిపారు. అనంతరం నర్సంపేటలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న భారీజనాన్ని ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ తర్వాత కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఏర్పాటుచేసిన బహిరంగసభకు చేరుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *