mt_logo

టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి – టీ రాజయ్య

మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, టీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీ పోటీ కాదని ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం టీ రాజయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభ్యర్థులు దొరక్కపోవడంతోనే క్రిమినల్, సమైక్యవాది అయిన జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని, అదేవిధంగా మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై లాఠీఛార్జి చేయించిన సునీతాలక్ష్మారెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని విమర్శించారు.

మెదక్ ఉప ఎన్నికలో కార్యకర్తలు లేక ప్రచారం నిర్వహించలేని దారుణమైన పరిస్థితి బీజేపీదని, మంత్రిగా ఉండి ఏనాడూ అమరుల కుటుంబాలను పరామర్శించని సునీతాలక్ష్మారెడ్డిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని రాజయ్య అన్నారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి ఎన్నికల్లో అధిక మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు సూచించారు. బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమని, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సమగ్ర సర్వేను నిర్వహించి కేసీఆర్ విజయం సాధించారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు.

పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, కేసీఆర్ పాలన అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని కేరళ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కీర్తించడం తమకు గర్వంగా ఉందని అన్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలను ఓడించి సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *