mt_logo

బీజేపీ అంటే బాబు.. జగ్గారెడ్డి పార్టీ – కేటీఆర్

– ఆంధ్రా పార్టీ నాయకులు చెప్తే.. ప్రజలు ఓట్లేయరు
– భారీ మెజారిటీతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి..
– బీజేపీ, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
– దేశం మొత్తం మెదక్ ఉప ఎన్నిక వైపే చూస్తున్నది..
– మెదక్ మండల, పట్టణ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్
– రైతులకు రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ: మంత్రి పోచారం
బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. ఏపీ ముఖ్యమంత్రి బాబు.. జగ్గారెడ్డి.. పార్టీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖామంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి సమైక్యవాది అయిన జగ్గారెడ్డికి బీజేపీ టికెట్ ఇప్పించారని అన్నారు. ఎవరెన్ని చెప్పినా.. ఆంధ్రా పార్టీ నాయకులు చెప్పిన వారికి ఓట్లు వేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక్క కార్యకర్త కూడా బీజేపీకి దొరకకపోవడం దురదృష్టకరమన్నారు. సమగ్ర సర్వేలో పాల్గొనని పవన్ కళ్యాణ్ చెబితే తెలంగాణలో ఓట్లు పడతాయా..? అని ప్రశ్నించారు. మెదక్ మండల, పట్టణ టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగింది. సమావేశానికి కేటీఆర్‌తోపాటు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ.. దేశం మొత్తం మెదక్ పార్లమెంట్ వైపు చూస్తున్నదన్నారు.

కేసీఆర్‌కు 4 లక్షల మెజారిటీ ఇచ్చిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు.. అంతకు ఎక్కువ మెజార్టీతో కొత్త ప్రభాకర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించి, ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో దగా పడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రాకు అన్ని పథకాలు ఇస్తూ తెలంగాణకు ఒక్క పథకం కూడా ఇప్పటివరకు కేటాయించలేదని దుయ్యబట్టారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్, టీడీపీలు వారసత్వంగా వదిలిపెట్టిన తెలంగాణలోని సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రెండు సంవత్సరాలపాటు విద్యుత్ సమస్యలు తప్పవని ఎన్నికల ప్రచారంలోనే చెప్పడం జరిగిందన్నారు.

విద్యుత్ కష్టాలకు ప్రధాన కారణం కాంగ్రెస్, టీడీపీ పార్టీలేనని దుయ్యబట్టారు. తెలంగాణలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని వివరించారు. రూ.19 వేల కోట్లు రైతులకు రుణమాఫీ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాల మాఫీ విషయంలో ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మాత్రం రుణాల రీ షెడ్యూల్‌కు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. 43 అంశాలను ఒకేసారి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.

ఇన్‌పుట్ సబ్సిడీతో 14లక్షలమంది రైతులకు లబ్ధి: మంత్రి పోచారం
2009 నుంచి అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోయిన రాష్ట్ర రైతులకు రూ.480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. దీంతో రాష్ట్రంలోని 14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుందన్నారు. మెదక్ జిల్లాలో 1.45 లక్షల మంది రైతులకు రూ.52 కోట్లు అందించనున్నట్లు చెప్పారు. మెదక్ మండలానికి రూ.1.57 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. రామాయంపేటకు రూ.15.50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. సమావేశంలో పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో విశ్వ విద్యాలయాలన్నీ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారాయని పేర్కొన్నారు.

పేద, బడుగు, బలహీన వర్గాల వారికి టికెట్లు ఇచ్చి చట్టసభలకు పంపిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. 2 లక్షల మంది ఆదివాసులను ముంచేసిన కేంద్ర ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదన్నారు. తెలంగాణ వద్దు.. సమైక్యాంధ్రే ఉండాలని పట్టుబట్టిన జగ్గారెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన చంద్రబాబు తెలంగాణ రైతుల సమస్యలపై మాట్లాడే హక్కు లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలను పార్టీ కార్యకర్తలకు వివరించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా ఉద్యమం చేసిన ఉద్యమకారులపై తూటాలు, లాఠీలు కురిపించిన కాంగ్రెస్‌కు, ఉద్యమకారులను కొట్టించిన జగ్గారెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, జెడ్పీటీసీ సభ్యురాలు లావణ్యారెడ్డి, ఎంపీపీ కొత్తపల్లి లక్ష్మీకిష్టయ్య, వైస్ చైర్మన్ రాగి అశోక్, మండల పార్టీ అధ్యక్షుడు కిష్టాగౌడ్, పట్టణాధ్యక్షుడు సలాం, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *