mt_logo

సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ కు సంఘీభావంగా కదం తొక్కిన ఎన్నారైలు

సెప్టెంబర్ 30 ‘చలో హైదరాబాద్ – తెలంగాణ మార్చ్’ కొరకు తెలంగాణ ప్రజలంతా పెద్ద ఎత్తున సన్నద్ధమౌతున్న సందర్భం! సెప్టెంబర్ 30 సమరం కోసం యావత్ తెలంగాణ యుద్ధ సన్నాహాలతో శంఖారావం పూరిస్తున్న సందర్భం! నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు తెలంగాణలోని గడ్డిపరక సైతం బాకులు దూస్తూ కవాతు చేస్తున్న సమర సందర్భం! ’ఇంటికో మనిషి చేతికో జండా – జై తెలంగాణ’ నినాదంతో తెలంగాణ మిన్ను మన్ను ఏకం చేస్తున్న మహత్తర ప్రజాస్వామిక సందర్భం! గతంలో మున్నెన్నడూ లేనంతగా సమరానికి సిద్ధమవుతున్న తెలంగాణ ప్రజల కవాతుకు ‘మేము సైతం’ మద్దతు తెలపాలని, సంఘీభావం ప్రకటించాలని తెలంగాణ ఎన్నారైలు సమాయత్తమయ్యారు. తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) ఉత్తర అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో ‘సంఘీభావ యాత్రలు’ నిర్వహించాలని పిలుపునిచ్చింది. బోస్టన్ , న్యూ జెర్సీ, ఫిలదెల్ఫియా, డెట్రాయిట్ నగరాల్లో సెప్టెంబర్ 22 నాడు మధ్యాహ్నం ‘తెలంగాణ మార్చ్ సంఘీభావ యాత్రలు’ నిర్వహించాలని తెనా కార్యక్రమం రూపొందించింది. తెనా పిలుపుకు స్పందించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఎన్నారైలు వారి వారి ప్రాంతాల్లో ‘సంఘీభావ యాత్రలను’ అత్యంత విజవంతంగా నిర్వహించి తెలంగాణ మార్చ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు.

తెనా , ఎన్ జె టి ఏ (న్యూ జెర్సీ తెలంగాణ అసోసియేషన్) సంయుక్తంగా, న్యూజెర్సీ రాష్ట్రం, న్యూ బ్రన్స్విక్ నగరంలో బ్యూక్లె పార్క్ లో ‘సంఘీభావ యాత్ర’ను నిర్వహించాయి. సెప్టెంబర్ 22 మధ్యాహ్నం మూదు గంటల కల్లా బ్యూక్లె పార్క్ కు తెలంగాణా ఎన్నారై లు , తెలంగాణ రాష్ట్రపటం ముద్రించిన జండాలతో, తెలంగాణ మార్చ్ కు మద్దతు తెలుపుతూ రాసిన నినాదాల ప్లకార్డ్ లతో, “We Support Telangana March” ‘ అని పెద్దగా రాసిన అక్షరాల బానర్ తో చేరుకున్నారు. ఒక అరగంట కాలంలో దాదాపు యాభై కన్నా ఎక్కువగా ఎన్నారైలు పార్కులో గుమిగూడారు. మెల్లమెల్లగా వానచినుకుల్లా మొదలై , అతి తక్కువ కాలంలో ఒక జడివానగా మారారు. ఒక కెరటంలా ఎగసి పడ్డారు! అందరి ముఖాల్లో ఒక ఆవేశం, ఒక ఉద్విగ్నత, ఉరకలెత్తే ఉత్సాహం – తెలంగాణ ప్రజల ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి ఉప్పొంగే ఉద్రేకం!

ఎన్నారైలంతా ప్లకార్డులు , జండాలు పట్టుకుని నినాదాలు హోరెత్తుతూ ఊరేగింపు ప్రారంభించారు! ‘ఏక్ ఔర్ ధక్కా తెలంగాణ పక్కా’ , ‘వి సపోర్ట్ తెలంగాణ మార్చ్ ‘, ‘ వి వాంట్ తెలంగాణ స్టేట్ నౌ’ , ‘ ప్రభుత్వం తెలంగాణ మార్చ్ కు అనుమతినివ్వాలి’, ‘తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమర వీరులకు జోహార్లు’, ‘ తెలంగాణ యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజికి జోహార్లు’ అంటూ నినాదాలు మిన్నంటగా తెలంగాణ ఎన్నారైలు ‘సంఘీభావ యాత్ర’ ను అత్యుత్సాహంగా నిర్వహించారు. దాదాపు అరగంట ఊరేగింపు తర్వాత ఎన్నారైలంతా ఒక చోట సమావేశమై నినాదాలని కొనసాగించారు.

తర్వాత తెనా , ఎన్ జే టీ ఏ ప్రతినిధులు తమ అభిప్రాయలని ప్రకటించి పోరాడుతున్న తెలంగాణ ప్రజలకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ లో తెలంగాణ ప్రజలంతా అవాంతరాలన్నింటినీ దాటుకుని పాల్గొని విజయవంతం చేయాలని, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా జరుగనున్న తెలంగాణ మార్చ్ కు రాష్టప్రభుత్వం అనుమతి నివ్వాలని, నిర్బంధ చర్య్లలను మానుకోవాలని లేదా జరిగే అవాంచనీయ సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశ పెట్టాలని, డిసెంబర్ 9 , 2009 ప్రకటనకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చెయ్యాలని అభిప్రాయపడ్డారు. గతవారం అమరులైన ప్రముఖ స్వాతంత్ర్యయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజి గారికి ఘనంగా నివాళులర్పిచారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం కాక మునుపే బాపూజి వెళ్ళిపోయినందుకు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేసారు.. తెలంగాణ రాష్ట్రం త్వరలో ఏర్పాటు కాబోతుందనే ప్రగాఢ నమ్మకం వ్యక్తపరుస్తూ వేలమైళ్ళ దూరాన ఉన్నా, మనసంతా తెలంగాణ మట్టితోనే ముడివడి ఉన్న తెలంగాణ ఎన్నరైలు రాష్ట్రమొచ్చేదాక విశ్రమించేది లేదని ప్రతిన బూనారు.

ఇదే సమయంలో బోస్టన్ లో వెంకట్ మారోజు, అమర్ కర్మిల్లా, జలగం మురళిధర్ రావు, నాగన్న, పాపారావు గుందవరం, వెంకట్ రెడ్డి ముద్దసాని, స్వరుణ్ నబుద్దినేని, శ్రీనివాస్ మేనేని, విజయ కాకి, రామారావు బుద్ధినేని, శాంతి పుట్ట, బల్విందర్ సింగ్ , కల్యాణ్ , సుధీర్ బోయినపల్లి, రాజు తదితరులు పాల్గొన్న ‘సంఘీభావ రాలీ’ విజయవంతంగా జరిగింది.

డెట్రాయిట్ లో భరత్ మాదాడి, శైలేంద్ర సనం, హరి మారోజు తదితరుల అధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైలు సమావేశమై విజయవంతంగా సంఘీభావ రాలీ నిర్వహించారు.

ఫిలడెల్ఫియాలో రవి మేరెడ్డి, మాధవ్ మొసర్ల , శ్రీధర్ గుడాల అధ్వర్యంలో తెలంగాణ ఎన్నారైలు సంఘీభావ రాలీలో పాల్గొని తెనా పిలుపును విజయవంతం చేశారు.

మొత్తంగా, ఉత్తర అమెరికాలో నాలుగు ప్రధాన నగరాల్లో .తెనా అధ్వర్యంలో ‘తెలంగాణ మార్చ్ ‘ సంఘీభావ రాలీలు అత్యంత ఉత్సాహంగా విజయవంతంగా జరిగాయి. ప్రత్యేక తెలంగాణ రాష్టం కోసం జరుగుతున్న ఉద్యమానికి, సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్ కి తెలంగాణ ఎన్నారైలు తమ సంఘీభావాన్ని ముక్తకంఠంతో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *