mt_logo

హైదరాబాదును దిగ్బంధిస్తాం.. తెలంగాణ మార్చ్‌ను ఏ శక్తీ ఆపబోదు: హరీశ్‌

ఫొటో: హనుమకొండలో జరిగిన తెలంగాణ మార్చ్ సన్నాహక ర్యాలీ దృశ్యం

ఊరూవాడా ఏకమైంది..! పల్లె నుంచి పట్టణం దాకా పోరు సైరన్ ఊదింది..! వచ్చే ఆదివారం హైదరాబాద్‌లో జరగబోయే తెలంగాణ మార్చ్‌కు సకలం సిద్ధమని ప్రకటించింది..! సన్నాహక ర్యాలీలతో హోరెత్తించింది. ఆడ, మగ..పిల్లా జెల్లా తేడా లేకుండా అందరూ రోడ్లమీదికి వచ్చారు. తెలంగాణ జెండాలు చేతబూని కవాతు చేశారు. ఓ వైపు భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రులు నిర్వహిస్తూనే.. మరో వైపు దశాబ్దాల ఆకాంక్ష కోసం కదంతొక్కారు. నినాదాలతో తెలంగాణ ఆదివారం జాతరైంది..! ఆటాపాటలతో మార్మోగింది..! నిజామాబాద్, బోధన్, హన్మకొండ, భువనగిరి, సూర్యాపేట, లాలాపేట, అడ్డగుట్ట.. ఇలా ప్రతిచోటా కవాతు కదిలింది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్‌ను ఆపేదిలేదని టీజేఏసీ చైర్మన్ కోదండరాం తేల్చిచెప్పారు. ఈనెల 30లోపు తెలంగాణ ప్రకటిస్తే ఖుషీ చేసుకుంటామని, లేదంటే తడాఖా చూపిస్తామని సర్కారుకు హెచ్చరించారు.

మార్చ్ వేదికను రెండురోజులు ముందుగా ప్రకటిస్తామని, సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లినట్టు ముల్లే మూట కట్టుకొని మార్చ్‌కు తరలిరావాలని యావత్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మార్చ్ రోజు జరగబోయే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, హైదరాబాద్‌ను దిగ్బంధించి తీరుతామని టీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు స్పష్టంచేశారు. మార్చ్‌ను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని, ఏ శక్తి అడ్డుకోబోదని చెప్పారు. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించినట్లు.. ఒక ఉద్యమకారుడు మరో వందమందితో తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్యాకేజీలకు, ప్రగల్భాలకు తెలంగాణ ప్రజలు లొంగబోరని కాంగ్రెస్ సీనియర్‌నేత కే కేశవరావు అన్నారు. ఇన్నాళ్లు మాటలతో ఆకాంక్ష వినిపించిన ప్రజలు ఇక చేతల్లో చూపించాలని ఆయన ఉద్బోధించారు. మార్చ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తెలిపారు. మార్చ్‌తో చరిత్రను తిరగరాయాలని టీజేఏసీ నేత మల్లెపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు. సీమాంధ్ర నేతల కుట్రలను అడ్డుకుంటామన్నారు.

తెలంగాణ ప్రకటించాలని, లేకపోతే కురుక్షేత్ర యుద్ధమేనని కేంద్రానికి టీజేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రసమయి బాలకిషన్ హెచ్చరించారు. మార్చ్‌ను సక్సెస్ చేసి, సత్తా చాటుదామని డాట్స్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. మార్చ్‌లో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుంచి పిల్లాపాపలతో తరలివస్తామని ముంబై తెలంగాణ బహుజన ఫోరం ప్రకటించింది. తెలంగాణ ఆకాంక్షను ఆంక్షలతో అడ్డుకోలేరని, ప్రజలు వీధుల్లోకి వచ్చిన తర్వాత వారు ఎవరి చేతుల్లో ఉండరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ మీడియాతో అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న తామూ హైదరాబాద్‌లో కవాతు నిర్వహిస్తామని తెలంగాణ మహిళా సంఘాల ప్రతినిధులు ప్రతినబూనారు. [నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *