mt_logo

ఉద్యమ జననీరాజనం సెప్టెంబర్ 30న సాగర హారం

సెప్టెంబర్ 30 నాడు తెలంగాణ మార్చ్ ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులపై అత్యంత శాంతియుతంగా జరుగుతుందని తెలంగాణ జే.ఏ.సి అధికారికంగా ప్రకటించింది. ఈ మార్చ్‌కు ‘సాగరహారం’ అని నామకరణం చేసింది. సోమవారం టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో టీజేఏసీ విస్తృతస్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశ నిర్ణయాలను టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విలేకరులకు వివరించారు. తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేసేందుకు ఇంటికో మనిషి, చేతిలో జెండాతో కదిలిరావాలని పిలుపునిచ్చారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష ప్రభుత్వానికి తెలిసేటట్లు, కాంగ్రెస్ పార్టీ గ్రహించేటట్లు తెలంగాణ మార్చ్‌ను నిర్వహిస్తామన్నారు. మార్చ్‌ను నిర్వహించడం పౌరులుగా తమ హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామిక దేశంలో ప్రజలు నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం, పోలీసుల అనుమతి అవసరం లేదన్నారు. తెలంగాణ మార్చ్‌కు బందోబస్తు నిర్వహించేందుకు మాత్రం పోలీసులకు ఉత్తరం రాస్తామని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర హోంమంత్రికి తెలిపామన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా కవులు, కళాకారులు, చిత్రకారులకు వేర్వేరుగా ప్రజాస్వామిక వేదికలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా తెలంగాణ మార్చ్ కు జే.ఏ.సి పిలుపు మేరకు సోమవారం కూడా పలు పట్టణాలలో సన్నాహక ర్యాలీలు, సమావేశాలు జరిగాయి. పోలీసుల నిర్భంధాన్ని తప్పించుకుని లక్షలాదిమంది ఉద్యమకారులను హైదరాబాద్ ఎలా చేర్చాలనే వ్యూహాలను పలు ఉద్యమ సంఘాలు రచిస్తున్నాయి.

తెలంగాణ మార్చ్ సందర్భంగా అరెస్టులు, లాఠీచార్జిలు జరిగినా, ఉద్యమకారులను హైదరాబాద్‌లో అడుగుపెట్టనీయకుండా కుట్రలకు పాల్పడినా ఉద్యోగుల మెరుపు సమ్మె నిర్వహించాలని టీజేఏసీ సమావేశంలో ప్రతిపాదన వచ్చినట్లు తెలిసింది. ఇందుకు అధికారులు, ఉద్యోగులు అందరినీ సిద్ధం చేయాలని భావించినట్లు సమాచారం. ఈ సమ్మె 42 రోజుల పాటు సాగిన సకల జనుల సమ్మెను మరిపించాలని, సకలం సమ్మె రెండో దశగా ఇది ఉండాలని పలువురు ప్రతిపాదించినట్లు తెలిసింది. వీటిపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. అయితే సీమాంధ్ర పాలకులు రెచ్చగొట్టినా ఎవరూ కూడా సంయమనాన్ని కోల్పోవద్దని, పూర్తిగా శాంతియుతంగానే తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం సూచించినట్లు తెలిసింది. మెరుపు సమ్మెలోకి అత్యవసర సర్వీసులను కూడా చేర్చాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషించారు. తెలంగాణ మార్చ్ కోసం హైదరాబాద్‌కు రానీయకుండా పోలీసులు అడ్డుపడితే ఎక్కడికక్కడ రాస్తారోకోలను నిర్వహించాలని, రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. [నమస్తే తెలంగాణ సహకారంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *