mt_logo

అంతర్జాతీయ విత్తన పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలు, రైతులతో రెండు గంటల పాటు మంత్రి నిరంజన్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. పరిశోధన కేంద్రంలో కలియతిరుగుతూ విత్తన పరిశోధన, విత్తనాలు మొలకెత్తే దశను పరిశీలించారు. అక్కడే ఉన్న విత్తన విశ్లేషకులతో మాట్లాడి పరిశోధనలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావించాలని అన్నారు. సీమాంధ్ర పాలనలో ఎడారిగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాలనలో సస్యశ్యామలంగా మారిందని తెలిపారు. రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలుపడం సీఎం లక్ష్యమన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విత్తన ఉత్పత్తి చేయడం పరిశోధన కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సాగు రంగంలో శాస్త్ర పరిశోధనలు పెరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎనలేని సేవ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ అనితాహరినాథ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, ఆయా శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *