mt_logo

ఏ పార్టీలోనైనా వలసలు ఉంటాయి- ఈటెల

సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అన్ని పార్టీలనుండి వలసలు సహజమేనని, కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ లోకి వలస వస్తున్నారని, అలాగే ఇతర పార్టీలనుండి కూడా కాంగ్రెస్ లోకి వలసలు ఉంటాయని, వీటి ప్రభావం టీఆర్ఎస్ పార్టీపై పెద్దగా ఉండదని స్పష్టం చేశారు. ‘ తెలంగాణ తెచ్చింది తామేనని, కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని పొన్నాల, దామోదర అంటున్నారని, టీఆర్ఎస్ కు పాలించే సత్తా లేదని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ను చిన్నదిగా చూపించి మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని, వైఎస్ కాలంలో పులిచింతల, పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా మేము మంత్రి పదవులకు రాజీనామా చేశామని, ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన పొన్నాలను బహిరంగ చర్చకు కేసీఆర్ పిలిస్తే మొహం చాటేశాడని మండిపడ్డారు. జలయజ్ఞం ధనయజ్ఞం అయ్యిందని జాతీయ మీడియా కూడా చెప్పిందని, దీనికి కారణమైన పొన్నాల కేసీఆర్ ను విమర్శించే అంతటివాడా?’ అని ఈటెల మండిపడ్డారు. తెలంగాణ ఎలా వచ్చిందో దేశం మొత్తానికి, తెలంగాణ ప్రజలకు తెలుసని, ఉద్యమం సమయంలో విద్యార్థులపై కేసులు పెట్టించి, ఉద్యమకారులపై బాష్పవాయుగోళాలను ప్రయోగించిన కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలెన్నటికీ మర్చిపోలేరని అన్నారు. దళితవ్యతిరేక పార్టీగా టీఆర్ఎస్ ను విమర్శిస్తున్న దామోదర నిజం తెలుసుకుని మాట్లాడాలని, కాంగ్రెస్ వల్లే దళితులు అభివృద్ధి చెందలేదనే విషయం ఎందుకు అంగీకరించట్లేదని ప్రశ్నించారు. దళితులను కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని, 66ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ వస్తే గడీల పాలన, దొరల రాష్ట్రం వస్తుందని కాంగ్రెస్ నేతలు చవకబారు ఆరోపణలు చేస్తున్నారని, ఒకవేళ అధికారంలోకి వచ్చాక మేము అలా చేస్తే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారని అన్నారు. ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనని వారు ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నారని, ఉద్యమకారులను జైళ్లలో పెట్టించిన వారికి తెలంగాణ ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ తోనే తెలంగాణ రాలేదని, ప్రతిపక్ష పార్టీగా బీజేపీ పార్లమెంటులో ఇచ్చిన మద్దతు వల్లే తెలంగాణ బిల్లు మద్దతు పొందిందని వివరించారు. వివేక్, వినోద్ లను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి తెచ్చేందుకు రాహుల్ గాంధీ కాకాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *