mt_logo

దళితుల హక్కులకోసం కృషి చేస్తా- కవిత

తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజనసంఘం ఆధ్వర్యంలో “తెలంగాణలో దళితుల భవిష్యత్తు” అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా గతంలో అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు దీక్ష చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఘనంగా సన్మానించారు. కవిత మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలోని దళితుల న్యాయమైన హక్కులకోసం, సంక్షేమం కోసం కృషి చేస్తానని, కాంగ్రెస్ పాలకులకు దళితుల పట్ల చిత్తశుద్ధి లేనందునే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఆలస్యమైందని అన్నారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతోనే ఆనాడు అంబేద్కర్ ఆర్టికల్-3ని రాజ్యాంగంలో పొందుపరిచారని, విగ్రహం ఏర్పాటుకు తాను దీక్ష చేస్తుంటే అగ్రవర్ణాలతో పాటు, కొందరు దళిత వర్గాలకు చెందిన నేతలు కూడా అడ్డుకున్నారని, తనను వెనక్కు తగ్గాలని సూచించారని చెప్పారు. దళితులకు చట్టసభల్లో, ఉద్యోగాలలో సముచిత స్థానం కల్పించాలని, విద్య, వైద్యం, ఉద్యోగాల్లో దళితులకు న్యాయం చేసే అంశాలను టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు టీవీ నారాయణ, గ్రేటర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ జీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *