టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం కొట్టిపడేశారు. సీమాంధ్ర పత్రికలు తనపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు కథనాలు రాస్తున్నాయని, టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీఆర్ఎస్ లో గందరగోళం సృష్టించేందుకు సీమాంధ్ర పత్రికలైన ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలు తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి వీ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మందా జగన్నాథం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసత్య ప్రచారాలు చేస్తున్న సీమాంధ్ర పత్రికలు, చానళ్ళపై న్యాయపోరాటం చేస్తానని, ఇలాంటి పత్రికలు, చానళ్ళను నమ్మొద్దని తెలంగాణ ప్రజలకు సూచించారు. తాను కేకే, వివేక్ తో కలిసి కాంగ్రెస్ ను వీడానని, వివేక్ మళ్ళీ కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన తాము కూడా వెళ్లాలనే రూల్ లేదని, కీలక సమయాల్లో ఎవరి నిర్ణయం వారికుంటుందని తెలిపారు. వివేక్ కాంగ్రెస్ లో చేరడం ఆయన వ్యక్తిగతమని, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన మొదటి వ్యక్తిని తానేనని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ తో కలిసి పనిచేస్తానని, కలిసికట్టుగా తెలంగాణను అభివృద్ధి చేస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ ద్వారానే సాధ్యమని, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తీవ్ర కృషి చేసిన టీఆర్ఎస్, కేసీఆర్ ను వదిలి ఏ పార్టీలో చేరనని మరోసారి స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందని, ఉద్యమంలో ఉన్న తమతో కాంగ్రెస్ నేతలెవరూ కలిసి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ముందే తెలంగాణ ప్రకటించిఉంటే 1200మంది తెలంగాణ బిడ్డలు బలిదానం చేసేవారు కాదని వ్యాఖ్యానించారు.