mt_logo

ప్రొఫెసర్ కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం

By: డాక్టర్ రాహుల్ రాజారామ్ 

తెలంగాణ కోసం అకుంఠితదీక్షతో దశాబ్ద కాలానికి పైగా రాజీ లేని పోరాటం చేసి నిలబడిన ఉపాధ్యాయుడు, పైగా ఉద్యమకాలంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆత్మగా మెలిగిన  ప్రొఫెసర్ కోదండరామ్‌తో ప్రభుత్వం వ్యవరించిన తీరు చాలామంది తెలంగాణవాదులను, ముఖ్యంగా మేధోవర్గాలు, విద్యావంతులను విస్మయానికి గురిచేసింది. శత్రువు కూడా వ్యవహరించని రీతిలో ఆయనను అరెస్ట్ చేయడం ఆందోళనకు గురిచేసింది. సహజంగానే ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది. తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వర్గాలను కూడా ఇది కొంత ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యానాలు, వ్యక్తమౌతున్న అభిప్రాయాలు ప్రభుత్వం అలా చేయాల్సింది కాదు అనే రీతిలో ఉంటున్నాయి. ఇది గర్హనీయం, పొలీసు చర్యను, ప్రభుత్వ వైఖరిని ఖండించాల్సిందే. కానీ తెలంగాణ సమాజంలో దీని ప్రభావం ఎంతమాత్రం కూడా కనిపించకపోవడం, తెలంగాణలోని రాజకీయపక్షాల నుంచీ కనీస మద్దతు కూడా దొరకకపోవడం, ప్రొ. కోదండరాంతో చిరకాల అనుబంధం కలిగిన ప్రొ. హరగోపాల్ లాంటి ఒకరిద్దరు వామపక్ష మేధావులు, ఆయన దశాబ్దాలుగా పనిచేసిన పౌరహక్కుల సంఘాలు మినహా పౌర సమాజం, చివరకు మీడియా కూడా పెద్దగా స్పందించలేదు. ఈ అంశాలను కూడా లోతుగా ఆలోచించాలి. ఆయన అరెస్టు తరువాత  ఆవరించిన మౌనం ఆయనకున్న ఆదరణ కంటే ప్రభుత్వానికి ఉన్న ఆమొదాన్ని సూచిస్తున్నదేమో అనిపిస్తుంది. హైదరాబాద్‌లో అదికూడా ఉద్యమ వేదికగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శివరాత్రి సెలవు రోజు ఒకటి రెండు వామపక్ష విద్యార్ధి సంఘాలు నిర్వహించిన బంద్ మినహా ఎక్కడా దాని ప్రభావం కనిపించలేదు. పైగా అదే రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. కురవి వరకు ఆయన హెలీకాఫ్టర్‌లో వెళ్లారు. అక్కడ ఆయనకు అనూహ్య స్వాగతం లభించింది. జాతరకు వచ్చిన వారితో సహా వేలాదిమంది యువకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడ వీరభద్రస్వామికి  మొక్కులు చెల్లించుకున్నంత సేపూ హర్షధ్వానాలతో జాతర వాతావరణం హోరెత్తింది. తరువాత ఆయన శాసనసభ్యుడు రెడ్యా నాయక్ స్వగ్రామమైన ఉగ్గంపల్లికి అదే హెలికాఫ్టర్‌లో వెళ్లాల్సి ఉంది. కానీ ప్రజల నాడిని పరిశీలించేందుకా అన్నట్టు ఆయన 22 కిలోమీటర్ల దూరం బస్సులో బయలుదేరి వెళ్లారు. ఆయన ప్రయాణమంతా జాతరలాగే సాగింది. విద్యార్థులు, యువకులు, రైతులు, కూలీలు దారిపొడవునా నిలబడి జేజేలు పలికారు. ఆయన అదే గ్రామంలో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా విలేకరుల నుంచి కూడా ప్రొ. కోదండరాం అరెస్టు కనీస ప్రస్తావనకు కూడా రాలేదు. పైగా తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు చేసే వారిని మీడియా మిత్రులు తెలంగాణ బిడ్డలుగా నిలదీయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆయన అధికారంలోఉన్నారు కాబట్టి మీడియాను మేనేజ్ చేశారని అనుకున్నా, ప్రజలు, యువకులు, సమాజం ఎందుకు స్పందించలేదు, అది ప్రొ. కోదండరాం అజెండా లోపమా, వ్యూహాత్మక తప్పిదమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నది. తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా పోయిన ఈ రోజుల్లో ప్రజలపక్షాన ఒక శక్తిగా ప్రొ. కోదండరాం ఎదగాలని భావించిన వాళ్లకు, ఆయన కచ్చితంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతాడని భ్రమపడిన వాళ్లకు ఇప్పుడు నిరాశే ఎదురవుతున్నది. ప్రభుత్వం తనతో అలా వ్యవహరిస్తుందని పాపం ప్రొఫెసర్ కోదండరాం కలలో కూడా ఊహించి ఉండరు. పైగా ఇప్పుడు జాక్ శిబిరంలో తన కుడి, ఎడమల నడిచినవాళ్ళే తిరగబడటంతో  ప్రొ. కోదండరాంలో నిస్పృహ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

ప్రొ. కోదండరాం సహజంగానే సౌమ్యుడు, మృదు స్వభావి. ఏ విషయాన్నైనా ప్రజాస్వామిక విలువలు ఉటంకిస్తూ చెప్పగల నేర్పరి. బహుశా మూడు దశాబ్దాలకు పైగా రాజనీతిశాస్త్రం బోధించడం వల్ల, పౌరహక్కుల ఉద్యమంలో పనిచేసి ఉండటం వల్ల ఆయనకు అవి అబ్బి ఉండవచ్చు. కానీ ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడిగా ఎదగలేరన్నది ఆయన జాక్ ప్రస్థానంలో రుజువయ్యింది. నిజానికి నిజ జీవితంలో కూడా ఆయన ఎన్నడూ రాజకీయ నాయకత్వంలో లేరు. ఉద్యమంలో పేరుకే రాజకీయ జేఏసీకి చైర్మన్‌గా ఉన్నా ఆయన కేసీఆర్ చెప్పు చేతల్లో ఉన్నారు. స్వతంత్రంగా ఏనాడు వ్యూహరచన గానీ, ఉద్యమ కార్యాచరణ గానీ రూపొందించలేదు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలతో పాటు వామపక్షాల నుంచి కూడా అప్పట్లో తీవ్ర విమర్శలను, నిందలు ఎదుర్కొన్నారు. తొలుత రాజకీయ జేఏసీ ఏర్పడింది కూడా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలతోనే. తరువాత మిగతా పార్టీలన్నీ అందులో చేరాయి. ఆ తరువాత అన్నిపార్టీలూ  కోదండరాం స్వతంత్రంగా లేరని, కేసీఆర్‌కు మౌత్ పీస్ లా మారిపోయారని, టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధిగా ఉంటున్నారని జేఏసీ నుంచి బయటకు వెళ్లిపోయాయి. అంతేకాదు కోదండరాం నాయకత్వాన్ని చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఏనాడూ ఆమోదించలేదు. ఆయనలో ప్రజాస్వామిక భావనలు లేకపోగా, అగ్రకుల, ఆధిపత్య ధోరణి, ఒంటెద్దు పోకడ రెండూ ఉన్నాయని పోటాపోటీ జాక్‌లు ఆయన సహచర అధ్యాపకులు ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తదితరులు ఏర్పాటు చేశారు. 2009-14 మధ్యకాలంలో ఈ పరిణామాలన్నీ జరిగిపోయాయి. చివరకు తెలంగాణ బిల్లు ఆమోదం పొందేనాటికి చివరకు టీఆర్‌ఎస్ కూడా జేఏసీలో లేదు. ప్రొఫెసర్ కోదండరాం అసమర్థ నాయకుడని, ఆయనను జేఏసీ నాయకత్వం నుంచి తప్పించి అప్పటి ఉద్యోగుల సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ను చైర్మన్ చేయాలని కూడా కేసీఆర్ భావించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. చివరకు ఎన్నికల నాటికి టీఆర్‌ఎస్, కోదండరాం నాయకత్వంలోని జేఏసీ మధ్య తెగదెంపులు జరిగిపోవడమే కాకుండా, రెండు వైరి శిబిరాలుగా మారిపోయాయి. కోదండరాం స్వయంగా ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. తన అనుచరుల్లో కొందరికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇప్పించారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉద్యమకారులకు టిక్కెట్లు ఇచ్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అనే తేడా లేకుండా ప్రచారం చేశారు. కొండా సురేఖ, పట్నం మహేందర్ రెడ్డి లాంటి ఉద్యమ వ్యతిరేకులకు టిక్కెట్లు ఇచ్చినందుకు టీఆర్‌ఎస్‌ను ఓడించాలని కూడా ఎన్నికలు జరిగినన్ని రోజులు ఆయన పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ దశలో ఆయన హైదరాబాద్ నుంచే పదహారు ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. అయినా ప్రజలు ఉద్యమంలో ఉన్నా లేకున్నా టీఆర్‌ఎస్ అభర్థులను భారీ మెజారిటీ తో గెలిపించారు. టీఆర్‌ఎస్‌ను ఏకైక తెలంగాణ ఉద్యమ వారసత్వ సంస్థగా గుర్తించారు. ఇది టీఆర్‌ఎస్ విజయం మాత్రమే కాదు. ప్రొఫెసర్ కోదండరాం స్వీయ రాజకీయ నాయకత్వ వైఫల్యం కూడా. ఒక రాజకీయశాస్త్ర ఆచార్యుడిగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తికి ఈ విషయం అర్థం కాకపోవడం ఆశ్చర్యం. పైగా టీజాక్ ను కరివేపాకులా వాడుకున్నారని ఆయన వాపోవడం అబద్ధమే కాదు, అన్యాయం కూడా. టీఆర్‌ఎస్ ఎన్నికల వంటలో కోదండరాం అనే కరివేపాకు లేకపోగా, ప్రొఫెసర్ పాపిరెడ్డి నాయకత్వంలో టీ (ఆర్‌ఎస్) జాక్ కొత్తగా పుట్టింది. ప్రొఫెసర్ కోదండరాం విద్యావంతుల వేదికకు పోటీగా వికాస సమితి పుట్టింది. రఘు నాయకత్వంలోని విద్యుత్ ఉద్యోగులు కొందరు, విఠల్ నాయకత్వంలోని ఉద్యోగుల సంఘంలో కొందరు మినహా దేవీప్రసాద్, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీధర్ దేశ్ పాండేల నాయకత్వంలోని సంఘాలన్నీ ప్రొ. కోదండ కు రాంరాం చెప్పి కేసీఆర్ పంచన చేరిపోయాయి. ఇదంతా వక్రీకరించ వీలుకాని అత్యంత సమీప చరిత్ర. ఇది ముమ్మాటికీ  కోదండరాం రాజకీయ వైఫల్యమే.!

అయినా సరే ప్రొ. కోదండరామ్ తన వైఫల్యాన్ని గుర్తించలేదు. జాక్‌ను రద్దుచేయలేదు. న్యాయంగా అయితే కేసీఆర్, జానారెడ్డి ప్రారంభించిన తెలంగాణ పొలిటికల్ జాక్ ఎప్పుడో రద్దు కావాలి. పొలిటికల్ జాక్‌లో భాగస్వాములుగా ఉన్న రాజకీయపార్టీలు అందులోంచి వెళ్ళిపోయిన మరుక్షణమే దానికి రాజకీయ నైతిక అస్తిత్వం లేదు. దానిని అప్పుడే రద్దు చేయాల్సింది. ఎందుకంటే జాక్ అనేది ఒక లక్ష్యం కోసం కొన్ని భిన్న రాజకీయ సిద్ధాంతాలున్న పక్షాలు ఏర్పాటు చేసుకునే తాత్కాలిక సంయుక్త కార్యాచరణ వేదిక. రాజకీయపక్షాలన్నీ పక్షుల్లా ఎగిరిపోయినప్పుడే దాని ఉమ్మడి అస్తిత్వం పోయి అది ఏక పక్షం అయిపోయింది. అది కాదనుకున్నా తెలంగాణ ఏర్పాటుతో లక్ష్యం నెరవేరినందున అది సహజంగానే రద్దుకావాలి. రెండూ జరిగినా దాన్ని రద్దు చేయకుండా ఒక సిక్ యూనిట్‌గా మిగిలిపోయిన జాక్ ను కొనసాగించడమే ఒక పెద్ద రాజకీయం. స్వాతంత్య్రం లక్ష్యంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ స్వరాజ్యంలోనూ కొనసాగి రాజకీయాలు చేసినట్టు తెలంగాణ ఏర్పడ్డాక, లక్ష్యం నెరవేరినా జాక్‌ను కొనసాగించాలని కోదండరాం నిర్ణయించుకున్నారు. ఉద్యమ సందర్భంలో ఒక చారిత్రక వేదికగా నిలిచిపోయిన టీజాక్ కోదండరాం తన రాజకీయ ప్రయోగశాలగా మార్చుకున్నాడనేది సుస్పష్టం. అదే కూలిపోయిన షెడ్డులో ఆయన తన విఫల ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన జాక్ కొనసాగుతుందని ప్రకటించారు. మొదటి బడ్జెట్ సమావేశాలు మొదలుకాకముందే ఆయన రైతుల ఆత్మహత్యలను ఆయుధంగా చేసుకున్నాడు. నిజానికి రైతుల సమస్యలు తెలంగాణ రాష్ట్రంతో మొదలయినవి కాదు. వాటికి దేశవ్యాప్తంగా ఆర్థిక విధానాలతో పాటుగా నైసర్గిక, వాతావరణ, కారణాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం మీద, రైతుల బలవన్మరణాల మీద కోదండరామ్‌కు లోతైన అవగాహన ఉన్నది. కానీ ఆయన అత్యంత తేలికపాటి కారణాలు చూపుతూ, సరైన హోంవర్క్ చేయకుండానే తెలంగాణ ప్రభుత్వం మీద కోర్టులో కేసు వేశారు. కోర్టులో కూడా ఆయనకు అపజయమే ఎదురయ్యింది. ఇదే దశలో వ్యవసాయరంగ సంక్షోభానికిప్రధాన కారణాల్లో ఒకటైన సాగునీరు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను వదిలేసి నీటి పారుదల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మిషన్ కాకతీయతో పాటు అనేక ప్రాజెక్ట్‌లను డిజైన్ చేసింది. అందులో భాగంగానే మల్లన్నసాగర్‌ను రూపొందించింది. కోదండరాం వెంటనే దాని వ్యతిరేక పోరాటం మొదలుపెట్టారు. రైతులను కూడగట్ట లేక ఆయన రాజకీయపార్టీలను కూడగట్టి కోర్టుల్లోకి సమస్యను నెట్టేశారు. ఏకకాలంలో రైతుల ఆత్మహత్యలమీద, ఆ ఆత్మహత్యలకు విరుగుడుగా ప్రభుత్వం రూపొందించిన నీటి ప్రోజెక్టుల మీద పోరాటం ప్రకటించిన ఆయన వ్యూహం ఏ రాజకీయ విశ్లేషకుడికి కూడా అంతుపట్టడం లేదు. అక్కడితో ఆగలేదు రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తుంటే ఆయన తన కోచైర్మన్ రఘుతో కరెంట్ కొనుగోళ్ళమీద రాద్ధాంతం చేసే ప్రయత్నమూ చేశారు. నదులు మళ్లించకుండా పొలాలు పారించాలని, భూమి సేకరించకుండా రిజర్వాయర్లు కట్టాలని, నీళ్లు ఇవ్వకుండా రైతాంగ సంక్షోభాన్ని నివారించాలని, విద్యుత్ కొనకుండా ఇరవైనాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలని ఆయన ఒక విచిత్రమైన అజెండా రూపొందించుకున్నారు. ఈ మూడు ఉద్యమాలూ వ్యూహాత్మక తప్పిదాలుగానే మిగిలిపోయాయి. ఆయన ఉద్యమం సమస్యమీద కాదని, ప్రభుత్వం మీద అని అందరికీ అర్థమైపోయింది. అది ప్రభుత్వానికి బాగా అర్థమయినట్టుంది.

నిజానికి ఇవన్నీ ఆయనకు అర్థం కాలేదని అనుకోలేం. కానీ వైఫల్యాలు వ్యక్తుల ఆలోచనలను చంపేస్తాయి. వైఫల్యాలు ఎదురౌతున్న కొద్దీ మనుషుల్లో అసహనం పెరిగిపోతుంది, ఒక్క విజయమైనా ఖాతాలో పడాలనే తహతహ పెరిగిపోతుంది. ఆ దశలో ఇంతపెద్ద మేధావులైనా బలహీనపడిపోతారు. మరిన్ని అనాలోచిత పనులు చేస్తుంటారు. నిరుద్యోగంపై ప్రొ. కోదండరాం మదిలో మెదిలిన కొత్త ఆలోచనా అందులో భాగమే. అనాలోచిత నిర్ణయం కాకపోతే కొనసాగుతున్న ప్రక్రియపై ఎవరైనా యుద్ధం మొదలుపెడతారా? 2015 సెప్టెంబర్‌లో ప్రొ. హరగోపాల్, ప్రొ. కోదండరాం, చుక్కా రామయ్య లాంటి మేధావులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ విడుదల చేశారు. ఆ వెంటనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన నోటిఫికేషన్లు మొదలుపెట్టి గడిచిన ఏడాదిన్నర కాలంలో 24 నోటిఫికేషన్స్ ఇచ్చి పరీక్షలు కూడా పూర్తి చేసింది. దాదాపు 5 వేలమందికి పైగా ఉద్యోగాల్లో చేరినట్టు చెపుతున్నారు. అదే సిలబస్‌ను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, ట్రాన్స్ కో, జెన్‌కో, సింగరేణి సహా మిగితా రిక్రూట్‌మెంట్ ఏజెన్సీస్ కూడా తీసుకున్నాయి. వాళ్ళ నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి, ప్రక్రియలు గతంలో ఈ రాష్ట్రంలో జరిగినదానికంటే, ఇప్పుడు దేశంలో జరుగుతున్న దానికంటే వేగంగా, పారదర్శకంగా, పకడ్బందీగానే జరుగుతున్నది. అలాంటి దశలో ప్రొ. కోదండరాం విద్యార్థులను, యువకులను వెంబడేసుకుని వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టాలి అని అల్లరి చేయడంలో ఆంతర్యం ఏమిటి? తన రాజకీయ క్యాలెండర్‌ను కనీసం జేఏసీలోని తన సమీప అనుచరులకు కూడా చెప్పని కోదండరాం పరీక్షల క్యాలెండర్ అడగడంలో అర్థం ఏమిటి?. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే ఫస్ట్ క్లాస్ వద్దని, ఇంగ్లీష్ మీడియం వద్దని, అసలు పరీక్షే వద్దని మూడు రోజులపాటు నానా యాగీ చేసి ఆ నోటిఫికేషన్స్ రద్దు చేయించిన కోదండరాంకు ఉద్యోగాల విషయంలో మాట్లాడడానికి ఉన్న అర్హత ఏమిటి? ఉస్మానియాలో నిరుద్యోగ జాక్ ఉండగా మళ్ళీ ఈ పొలిటికల్ జాక్ పోకడేమిటి? ఇవన్నీ కోదండరాం రాజకీయ అయోమయానికి అద్దంపట్టే ప్రశ్నలు. ప్రొ. కోదండరాంను ఆయనకే అర్థం కాని రాజకీయశక్తి ఏదో ఆవహించింది. వీలైతే తక్షణం ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, కుదరకపోతే మళ్ళీ ఎన్నికలనాటికి పార్టీ పెట్టి పోటీ చేయడం ఆయన ప్రధాన లక్ష్యం. అందులో కుల, వర్గ ప్రయోజనాలు ఎలా ఉన్నాయనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఆ లక్ష్యంలో భాగంగానే ఆయన గడిచిన రెండున్నరేళ్లు ఆయనే పదేపదే చెపుతున్నట్టు కాలికి బలపం కట్టుకుని లక్షల కిలోమీటర్లు తిరిగారు, కానీ లక్ష్యాన్ని మాత్రం చేరలేకపోయారు. అటువంటి బలహీనమైన క్షణంలో ఆయనకు నిరుద్యోగులు కంటపడ్డారు, ఉస్మానియా పిల్లలు కంటపడ్డారు. భావోద్వేగాలను రెచ్చగొడితే ఉద్యమం నిలబడుతుందని భావించారు. కానీ ప్రొఫెసర్ గారి  పాఠం పిల్లలకు తలకెక్కకపోగా జాక్ కు ఒక పెద్ద గుణపాఠమై మిగిలింది.

ఇంత జరిగినా సమీక్షించుకోకుండా ఆయన ఇప్పుడు తెలంగాణవాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తనకు తానుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ. జయశంకర్, మానవీయ పౌరసమాజ భావన రూపశిల్పి డాక్టర్ కె. బాలగోపాల్‌తో సరిసమానంగా పోల్చుకుంటున్నాడు. నిజానికి వారిద్దరికీ వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. రాజకీయ అవసరాలు లేవు. ఒకరిది తెలంగాణ ఆశ అయితే, ఇంకొకరిది హక్కుల ధ్యాస. ఇద్దరికీ సొంతగా అజెండా లేదు. వాళ్ళ దారిలో రాజకీయ నాయకులు నడిచి ఉండవచ్చు. కానీ ఏనాడూ ఏ రాజకీయ నాయకులతో వాళ్ళు నడవలేదు. ఎవరినైనా బహిరంగంగానే నిలదీశారు తప్ప ఎవరితోనూ రహస్యంగా సంప్రదింపులు జరుపలేదు. వారిద్దరూ ఉద్యమాలకు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు, ఉద్యమ కాలంలో జీతాలను కూడా త్యాగం చేయలేని వాళ్ళు, వాళ్ళతో పోల్చుకోవడం కూడా అపచారమే.! వారికి సాటిగలవారు ఇంకెవరూ లేరు, ఉండరు. ఇది ప్రొ. కోదండరాం కు తెలుసు. అయినా ఆయన వారిచుట్టూ తన సిద్ధాంత ప్రాతిపదిక ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారు. రాష్ట్ర అనంతరం తెలంగాణలో ప్రత్యామ్నాయం లేకపోవడం బాధాకరమే. కానీ కోదండరాం కులం రీత్యా, వర్గ రాజకీయాల రీత్యా, వ్యవహార శైలి రీత్యా అది సాధ్యం కాదు. కోదండరాంతో దాదాపు ముప్పై ఏళ్ళు కలిసి ఒకే రాజకీయ సిద్ధాంతాలు పంచుకుని నడిచిన వ్యక్తుల్లో డాక్టర్ చెరుకు సుధాకర్, మల్లేపల్లి లక్ష్మయ్య ముఖ్యులు. ఇవాళ కోదండరాం ప్రత్యామ్నాయం కాజాలడని చెరుకు సుధాకర్ బహిరంగంగానే చెపుతున్నాడు. మూడు దశాబ్దాలు నూతన ప్రజాస్వామిక పంథాను అనుసరించిన కోదండరాంలో ప్రజాస్వామిక రాజకీయ విలువలే లేవని ఎత్తి చూపుతున్నాడు. ఒకరకంగా మల్లేపల్లి లక్ష్మయ్య లేకపోతే కోదండరాం విద్యావంతుల వేదిక ఇంతకాలం నడిపేవాడు కూడా కాదు. ఆ సంగతి ఎప్పుడో అర్థం చేసుకున్న మల్లేపల్లి లక్ష్మయ్య కొత్తమార్గంలో వెళ్ళిపోయాడు. ప్రొ. కోదండరాం తన పరిమితులు గ్రహించకుండా ఇంకా ఆయన తన రాజకీయ విన్యాసాలు చేస్తూ పోతే ఆయన తెలంగాణలో ప్రజాస్వామిక విలువలకు, ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఉన్న స్పేస్‌ను కూడా లేకుండా చేసినవారు అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *