Mission Telangana

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ప్రవాస తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో మార్చి 4 న ప్రవాస మహిళలు అంతా ఒకేచోట చేరి మహిళా దినోత్సవ వేడుకలు చాల ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ వేడుకలకు ఇండియన్ జిమ్ఖాన్ క్లబ్ వేదికగా మారింది. ఇంగ్లాండ్ లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 300 మంది మహిళలు ఈ వేడుకలలో పాల్గొన్నారు.

ప్రవాస తెలంగాణ సంఘం-మహిళా విభాగం సభ్యులు వేడుకలకు విచ్చేసిన మహిళలను సాదరంగా ఆహ్వానించారు.

మీనాక్షి అంతటి గారు స్వాగాతోపన్యాసంలో మహిళా సాధికారత కోసం మహిళలందరూ కలిసికట్టుగా కృషి చేయాలి అని, ఈ వేదిక ద్వారా ప్రవాస మహిళలను ఒకేతాటి మీదకు తీసుకువస్తున్నామనీ, వ్యాపార, టెక్నాలజీ, విద్య, సేవ తదితర రంగాలలో ఆసక్తివున్న వారంతా ఈ గ్రూపు ద్వారా TeNF ను సంప్రదించవచ్చనీ, TeNF ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందనీ తెలిపారు.

ఇటివల ప్రవాస తెలంగాణ సంఘం-మహిళా విభాగం “చేనేత వస్త్రాలను ధరించుదాం నేతన్నకు మద్దతునిద్దాం” అని నినదిస్తూ చేసిన ప్రచార కార్యక్రమానికి వచ్చిన అశేష స్పందన ఎంతో స్ఫూర్తినిచ్చిందని, అదే స్ఫూర్తితో చేనేత వస్త్రాల ప్రదర్శనను ఈ వేడుకలలో ప్రధాన భాగం చేశామని, దీని ద్వారా లండన్లో నివసిస్తున్న మహిళలకు చేనేతను మరింత చేరువ చేసే అవకాశం దక్కిందని, ప్రవాస మహిళలందరినీ చేనేతను ధరించే విధంగా ఈ వేదిక ద్వారా ప్రోత్సహిస్తున్నాము అనీ, ఇకపైన ఎవరైనా చేనేత చీరలు కావాలి అంటే TeNF కు సందేశం పంపవచ్చనీ తామే చీరలను నేతన్నల దగ్గరి నించి తెప్పిస్తామని ప్రీతీ నోముల తెలిపారు.

హేమలత గంగసాని, శౌరి గౌడ్, శ్రీలక్ష్మి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ఆటవిడుపు కోసం రాఫెల్ డ్రా మరియు చాలా రకాలైన చిన్న చిన్న ఆటల పోటీలు నిర్యహించి గెలిచిన వారికి బహుమతులు అందించారు.

వేడుకలలో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో బూత్ లో ఆసక్తి గల మహిళలు ఫోటోలు తీసుకొని ఆనందించారు. అంతేకాకుండా ఉత్సాహంగా నర్తించారు. హైదరాబాదీ బిరియాని, ఇంక సుప్రసిద్ధ తెలంగాణ వంటకాలతో కూడిన విందుకి అంతా సంతృప్తి చెందారు.

మహిళల స్పందన: ప్రతీరోజు దైనందిన కార్యక్రమాలతో సతమతమయ్యే మాకు ఈ వేడుకలు ఎంతోగానో నచ్చాయని, ఇక్కడకి వచ్చినందుకు ఎంతో మంది పరిచయమయ్యారు అని, మాలో చాలా మందికి ఎన్నో చేయాలి అని ఉంటుంది అనీ, మాలాంటి వారికి TeNF కల్పిస్తున్న ఈ వేదికను సద్వినియోగం చేసుకుంటామని, ఆట పాటలతో సేదతీరామని, మరీ ముఖ్యంగా చేనేత వస్త్ర ప్రదర్శన చాలా గొప్ప కార్యక్రమము అని వారే కాకుండా వారి స్నేహితులకి కూడా చేనేతను ధరించమని చెప్తామనీ, విందు ఎంతో సంతృప్తినిచ్చిందనీ హాజరైన మహిళలు వారి హర్షాన్ని వ్యక్తం చేసారు.

దూర ప్రాంతాల నించి కూడా ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేసినందుకు అందరికి ప్రవాస తెలంగాణ సంఘం-మహిళా విభాగం తరపున పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. వేడుకలకు హాజరైన మహిళలు స్పందించిన తీరు తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది అని ఇకముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకుందాము అని, వివిధ రంగాలలో ఆసక్తి వున్నవారు TeNF ను ఎప్పుడైనా సంప్రదించవచ్చనీ, TeNF నిర్వహించే వేడుకలలో పాలుపంచుకోవచ్చనీ, వ్యాపారపరమైన స్టాల్ల్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చని, సేవా కార్యక్రమాలలో వాలంటీర్స్ గా పాల్గొనవచ్చనీ – జ్యోతి కాసర్ల పేర్కొన్నారు.

ఈ వేడుకలలో మహిళా విభాగం తరపున జయశ్రీ గంప, మీనాక్షి అంతటి హేమలత గంగసాని, జ్యోతి కాసర్ల గౌరీ శౌరి శ్రీలక్ష్మి నాగుబండి వాణి అనసూరి రామ శ్రీవాణి కావ్య, ప్రియాంక, సంధ్య మేఘల, సుచరిత, శిరీష లు – చేనేత చీరలను కొని నేతన్నలకు తమ మద్దతు ని తెలిపిన మహిళలందరికీ ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *