mt_logo

దేశ ప్రజల సమస్యల పరిష్కారమే భారత్ రాష్ట్ర సమితి ఎజెండా : సీఎం కేసీఆర్

దేశానికి తెలంగాణ మాడల్‌ పాలన అందించేందుకు కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు ప్రస్థానం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ కేతనం టీఆర్‌ఎస్‌ భారత్‌ రాష్ట్ర సమితిగా పునరావిష్కారమై, సబ్బండ వర్ణాల సంక్షేమమే అజెండాగా దేశంలో గుణాత్మక మార్పు దిశగా.. విజయ దశమి పర్వదినాన తొలి అడుగు వేసింది.

తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ‘మన పార్టీ పేరు ఇకపై భారత్‌ రాష్ట్ర సమితి’ అని ఉద్ఘాటించారు. ఇదే పేరుపై జాతీయ స్థాయిలో కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సర్వ సభ్యసమావేశంలో టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ జాతీయ పార్టీగా మార్చే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. మన దేశంలో రాజకీయాలు ఒక పార్టీ గెలుపు.. మరో పార్టీ ఓటమి అన్నట్టుగానే సాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గెలువాల్సింది ప్రజలు కానీ.. పార్టీలు కాదని తెలిపారు. ప్రజలు గెలిచే పంథాను రాజకీయ పార్టీలు అనుసరించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలంటే ఒక ఆట లాంటిదని.. టీఆర్‌ఎస్‌కు మాత్రం అదొక టాస్క్‌ అని.. యజ్ఞం అని స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తన అభిమతమని, అందుకే తాము అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగామని చెప్పారు.

దేశంలో నేటికీ గుక్కెడు తాగునీరు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేసీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చి అద్భుతం చేశామన్నారు. అనేక రాష్ట్రాలకు భగీరథ ఆదర్శంగా మారిందని చెప్పారు. వ్యవసాయరంగంలో కూడా తెలంగాణ కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని, సాగుయోగ్యమైన ప్రతి ఇంచు భూమికి నీటి వసతి కల్పించాలని సంకల్పించి అందుకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకొన్నామని పేర్కొన్నారు. కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దుకొన్నామని వివరించారు. దేశంలో నీటి వసతి లేక దాదాపు 44 కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యం కాకుండా పోయిందని వెల్లడించారు.

రైతులు తమ సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు 13 నెలలపాటు రోడ్లపై ధర్నాలు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రపంచానికి అన్నం పెట్టేంత వనరులు, కష్టపడే మనుషులున్న దేశం మనదని చెప్పారు. కనీసం ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 70 వేల టీఎంసీల నీటిని మళ్లించలేకపోతున్నారని పేర్కొన్నారు. దేశంలో అపారమైన సహజవనరులు, మానవ వనరులు ఉన్నా వాడుకోలేకపోతున్నామని తెలిపారు. తెలంగాణలో మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయగలిగినప్పుడు దేశమంతా ఇవ్వలేమా? అని ప్రశ్నించారు. మనకు చిత్తశుద్ధి ఉంటే శుద్ధి చేసిన మంచినీళ్లు దేశమంతా ఇవ్వవచ్చన్నారు.

దేశ ప్రజలు వంచనకు గురవుతున్నారని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఆదుకొనేవారు లేక, సరైన వనరులు లేక మహారాష్ట్రలోని ఒక్క యవత్మాళ్‌ జిల్లాలోనే ఏటా 50 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా మనం ఇలాగే ఉందామా? మన రైతుల తలరాతలు మారొద్దా?’ అని ప్రశ్నించారు. ‘మనం ఇప్పుడు రకరకాల బ్రాండ్లతో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ను చూస్తున్నాం. పిజ్జాలు, బర్గర్లు అంటూ తింటున్నామంటే మనకు అవమానకరం. అమెరికానో.. మరో దేశ కంపెనీలు ఇక్కడ ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ అమ్ముతున్నాయి. మన దగ్గర వనరులు లేవా? మానవ సంపద లేదా? ఇంకా ఇతరులపై ఆధారపడటమంటే ఎంత అన్యాయం? ఈ పరిస్థితి మారాలి. మన దేశంలోని వనరులను మనం వాడుకుంటే ఉజ్వల భారతాన్ని తయారు చేసుకోవచ్చు’ అని సీఎం చెప్పారు.

తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అనేక రాష్ట్రాల వాళ్లు అధ్యయనం చేసి స్ఫూర్తి పొందుతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. వాళ్లలో కొందరు తనను కలిసి తమ రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్‌ ఉంటే బాగుండునని అభిప్రాయపడినట్టు చెప్పారు. తనతో కలిసి పనిచేయాలని ఆకాంక్షించారని, పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని విజ్ఞప్తి చేశారని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి వస్తే కలిసి నడుస్తామని చెప్పడమే కాకుండా అనేకమంది తమ సలహాలు సూచనలు ఇచ్చారన్నారు. అందుకే ఇప్పుడు ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా పార్టీ పేరు మార్చుకొంటున్నామని తెలిపారు.

మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు పలు రాష్ట్రాల నాయకులు, రైతులు తెలంగాణ మాడల్‌ అభివృద్ధి కావాలని చెప్పారని వివరించారు. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది దేశంలో చిరస్థాయిగా ఉంటుందని చెప్పారు. ‘దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం.. వంటివి ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు సాగుతాం. దేశంలోని అనేక సామాజిక రుగ్మతలపై మన పోరాటం ఉంటుంది. ఇప్పటికే అనేక రుగ్మతలను ఎలా రూపుమాపామో తెలంగాణ ఆచరించి చూపించింది. తెలంగాణ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను దేశ స్వాతంత్య్రం వచ్చినపుడు అమలు చేసి ఉంటే బాగుండేది. మనం అవుటాఫ్‌ బాక్స్‌ నుంచి ఆలోచన చేసి, వినూత్న కార్యక్రమాలను రూపొందించి అమలు చేశాం. అందువల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమయ్యింది’ అని కేసీఆర్‌ తెలిపారు.

దళిత జనోద్ధరణకోసం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని.. తెలంగాణ సమాజంలోని ఇతరులకు అందే అన్ని ప్రయోజనాలతోపాటు అదనంగా దళితబంధు ప్రయోజనాన్ని పొందుతున్నారని కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని 8.40 లక్షల కుటుంబాలకు దళితబంధు, రైతుబంధు అందుతున్నాయన్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ దళితనాయకుడు, ఎంపీ తిరుమావళన్‌కు చెప్తే ఆయన ఆశ్చర్యపోయారని తెలిపారు. ‘రాష్ట్రంలో మొత్తం 17.50 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా దళిత బంధు అందుతుంది. దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న చిత్తశుద్దితో ఈ కార్యక్రమం చేపట్టాం’ అని వివరించారు.

పేదరికం అనేది ఒక కులానికో, మతానికో పరిమితం కాలేదని, అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారరని చెప్పారు. వీరంతా పేదరికం కారణంగా అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. స్థూలమైన విషయాల్లో మౌలిక మార్పు రాకుండా.. సామాజిక పరిస్థితుల్లో మార్పు సాధ్యం కాదన్నారు. ‘ఏ దేశమైనా.. సమూహమైనా తాము నిత్యం అనుసరిస్తున్న సాధారణ పనివిధానం నుంచి బయటపడి వినూత్నంగా పనిచేస్తాయో.. సమాజాన్ని వినూత్నమైన పంథాలో నడిపిస్తాయో అటువంటి దేశాలు.. సమూహాలు గుణాత్మకమైన మార్పును చూస్తాయి. మార్పు కోరుకోని సమాజాలు ఉండవు. అలాంటి సమాజాలు మారలేవు. ప్రజలను చైతన్య పరిచే సమాజాలే గొప్ప ఫలితాలను సాధిస్తాయి. మన దేశంలో గుణాత్మకమైన మార్పు కావాలి’ అని కేసీఆర్‌ అన్నారు.

‘మన మొట్టమొదటి కార్యక్రమం రైతులకు సంబంధించిందే. మన పార్టీకి అనుబంధంగా త్వరలోనే రైతు విభాగాన్ని ఏర్పాటు చేసుకొంటాం. మహారాష్ట్ర నుంచే మన కార్యక్రమం మొదలుపెడ్తం. రైతు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తం. ఈ సమావేశంలో కూర్చున్నవాళ్లంతా తెలంగాణ సాధించిన యోధులు. వీళ్లంతా ఇదే స్ఫూర్తితో దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అని కేసీఆర్‌ చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా విజయ తీరాలకు తీసుకెళ్లామో.. దేశాన్ని కూడా విజయాల వైపు నడిపించుకొందాం. తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకొన్నమో.. దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకొందాం. తెలంగాణ ప్రజలను ఎట్లా అయితే గెలిపించుకొన్నమో.. దేశ ప్రజలను కూడా గెలిపించుకొందాం’ అని పిలుపునిచ్చారు. ఇందుకు అందరి సహకారం అవసరమని అన్నారు.

దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీగా ముందడుగు వేస్తున్నామని, దేశ ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా జాతీయ జెండా పట్టుకొన్నామని చెప్పారు. ఈ చారిత్రక కార్యక్రమానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ రావాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వారి పరిస్థితులను అర్థం చేసుకొని తానే వద్దన్నానని కేసీఆర్‌ తెలిపారు. ‘వారు నాకు ఫోన్‌చేసి మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్న సమావేశం పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమే. మనం పార్టీ లాంచింగ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఆ కార్యక్రమానికి అందరినీ పిలుచుకుందాం. దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు మనతో కలిసి వస్తామని చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి మాజీ ప్రధాని దేవెగౌడ గట్టిగా మద్దతు ఇచ్చిన విషయం మనం మరిచిపోలేం. ఇప్పటికే మన పార్టీకి మద్దతుగా పలు రంగాలవారు సలహాలు అందించారు. జాతీయ పార్టీ ఏర్పాటు గురించి అనేక చర్చలు చేశాం’ అని సీఎం తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా తానే ఉంటానని, సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానని కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. తెలంగాణ తన కార్యక్షేత్రమని, రాష్ట్రాన్ని వదిలిపెట్టబోనని, దీని విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరంలేదని అన్నారు.

తెలంగాణ కోసం ఎట్లా అయితే కష్టపడి పనిచేసినమో.. దేశం కోసం కూడా అట్లానే కష్టపడి పనిచేద్దామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా నిర్ణయం తీసుకోలేదని, అన్నీ చేసి చూపించిన తర్వాత.. బలమైన పునాదుల మీద నుంచే ఈ నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ‘భారత దేశం రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలు, దేశం రెండు కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యం. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు చేసిన త్యాగాలు చాలా వరకు ఫలితం లేకుండా పోయాయి. రెండు వివక్షలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఒకటి లింగ వివక్ష అయితే.. రెండోది కుల వివక్ష. లింగ వివక్ష వల్ల దేశంలో సగ జనాభాగా ఉన్న మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కావడంలేదు. దీనివల్ల నష్టం జరుగుతున్నది. దేశ జనాభాలో 20% ఉన్న దళితులు కుల వివక్షను ఎదుర్కొంటుండటంతో వారు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కాలేకపోతున్నారు. ఇటు మహిళా శక్తి.. అటు దళిత శక్తి నిర్వీర్యం కావడం వల్ల అభివృద్ధి జరగటంలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *