సోమవారం నిజామాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగసభలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్ తోనే సాధ్యమని, తెలంగాణను సాధించడంలో టీఆర్ఎస్, కేసీఆర్ ది పెద్దన్న పాత్ర అని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో పెద్దనేతలైన కాంగ్రెస్ నేతలు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, డీ శ్రీనివాస్, సురేష్ రెడ్డి లాంటివారు ఒక్కసారికూడా సోనియా ముందు జై తెలంగాణ అనలేదని, ఏనాడూ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించనివారు ఇప్పుడు తెలంగాణను తామే ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. మరోపక్క బీజేపీ తమ మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అనడం తెలంగాణ ప్రజలను అవహేళన చేసినట్లే అని పేర్కొన్నారు.
మరోపక్క గజ్వేల్ లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో హరీష్ రావు మాట్లాడుతూ చంద్రబాబుకు పిచ్చిపట్టిందని, ఆయనకోసం ఎర్రగడ్డ హాస్పిటల్ లో బెడ్ సిద్ధంగా ఉందని అన్నారు. తెలంగాణలో టీడీపీకి నాలుగు సీట్లు కూడా రావని తెలిసినా చంద్రబాబు గెలిచిన అభ్యర్థులకు మంత్రి పదవులు ఇస్తానని చెప్పడం వింతగా ఉందని, గజ్వేల్ లో టీడీపీ అభ్యర్థి గెలుపుకోసం కార్యకర్తలు కుక్కల్లా పనిచేయాలని చంద్రబాబు కోరడం దారుణమని, ఇక్కడి పార్టీ కార్యకర్తలు బాబుకు కుక్కల్లా కనిపిస్తున్నారా? అని మండిపడ్డారు.