mt_logo

బీజేపీ సాయంతో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్రులు పన్నుతున్న భారీకుట్రలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తెలిసిన తెలంగాణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.

దీని వెనుక సీమాంధ్ర లాబీ భారీ పధకరచన ఉన్నదని, తెలంగాణలో రేపు ఎన్నికలు ముగియగానే ఈమేరకు నరేంద్ర మోడి ఒక ప్రకట చేస్తారని బీజేపీ వర్గాలే మీడియాకు లీక్ చేస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ మాట్లాడుతూ హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చేస్తానని చెప్పిన మాటలను టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉటంకిస్తూ నిన్న జరిగిన నిజామాబాద్ సభలో తెలంగాణ ప్రజలను అప్రమత్తం చేశారు. వాస్తవానికి గత కొన్నిరోజులుగా నరేంద్రమోడీ చంద్రబాబు, పవన్ లాంటి ఆంధ్రా నాయకులను వెంటపెట్టుకుని తిరుగుతున్నప్పుడే మోడీ పక్కా తెలంగాణ ద్రోహి అని, బీజేపీకి ఓటేస్తే టీడీపీకి వేసినట్లే అని తెలంగాణ ప్రజలను కేసీఆర్ హెచ్చరిస్తూ వచ్చారు.

ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలు ముగియనుండటంతో వెంటనే మే 1న తిరుపతిలో జరిగే బహిరంగసభలో హైదరాబాద్ ను యూటీ చేసే విషయమై నరేంద్రమోడీ ప్రకటించనున్నారని, దీనికి సీమాంధ్రులు భారీగా స్కెచ్ వేశారని తెలిసింది. అయితే ఈ విషయాన్ని నేరుగా కాకుండా హైదరాబాదును దేశానికి “ప్రత్యామ్న్యాయ రాజధాని” గా ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఈ పధకంలో భాగంగా హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ మొత్తం డిల్లీ ఎన్‌సీఆర్ తరహాలో తయారుచేయబడుతుంది. కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ జనరల్ కు నగరం మీద సర్వాధికారాలు ఉండటంతో పాటు, శాంతి భద్రతలు, ఆదాయం, న్యాయవ్యవస్థ తదితర విషయాలపై అతడివే సర్వాధికారాలు.

వాస్తవానికి ఈ భారీ కుట్రకు జనవరి మధ్యలోనే బీజం పడింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర నేతలు హైదరాబాద్ ను యూటీ చేయడంలో ఒప్పించలేకపోయారో అప్పుడే సీమాంధ్రకు చెందిన మీడియా వ్యక్తులు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు, సినీపరిశ్రమకు చెందిన వ్యక్తులు ఒక సమావేశం ఏర్పాటు చేసి బీజేపీని అధికారంలోకి తేవడం ద్వారా హైదరాబాద్ యూటీ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు.

రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఒకే సామాజికవర్గానికి చెందిన ఇద్దరు సీమాంధ్ర నేతలు ఈ భారీ కుట్రలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. వారెవరన్న విషయం ఇప్పటికే అందరికీ అర్థమయ్యుంటుంది.

మాకందిన సమాచారం ప్రకారం సీమాంధ్రకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే సీమాంధ్ర నేతలకు, నరేంద్రమోడీకి మధ్యవర్తిగా అహ్మదాబాద్ కు జనవరి నెలాఖర్లో వెళ్లారు.

ఒప్పందం ప్రకారం సదరు ఎమ్మెల్యే టీడీపీ, బీజేపీ పరోక్ష సహకారంగా ఎంపీగా పోటీ చేసేటట్లు మాటతీసుకున్నారు. రేపు లోక్ సభలో ఈ నేతనే హైదరాబాద్ విషయమై రాజ్యాంగ సవరణను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. పథకంలో భాగంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు ఇటీవలనే టీడీపీ, బీజేపీ పార్టీలలో చేరారు.

తెలంగాణ బీజేపీ నేతలపై జాతీయస్థాయి బీజేపీ నాయకత్వం చూపిన పక్షపాత ధోరణి చూస్తే, వారు సీమాంధ్ర లాబీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని మనకు తెలుస్తుంది.

తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మేల్కొని సీమాంధ్ర నేతలు చేస్తున్న భారీ కుట్రలను తిప్పికొట్టాలి. హైదరాబాద్ ను తెలంగాణ నుండి వేరుచేయాలని చూస్తున్న బీజేపీ, టీడీపీలకు తెలంగాణవాదులు ఓటు వేయొద్దని మిషన్ తెలంగాణ విజ్ఞప్తి చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *