టీడీపీ, బీజేపీలకు ఓటేస్తే భాగ్యనగరం మనకు దక్కదని, హైదరాబాద్ కు మరణశాసనం రాసినట్లే అవుతుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న కేసీఆర్ టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీయే కూటమికి ఓటేస్తే హైదరాబాద్ మనకు కాకుండా చేస్తారని, హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేస్తానని మోడీ రెండురోజుల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం గుర్తుచేశారు. ఇక్కడ ఎన్నికలు ముగియగానే సీమాంధ్ర ప్రచారానికి వెళ్లి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం లేదా, దేశానికి రెండో రాజధాని చేస్తామని మోడీ ద్వారా చంద్రబాబు, వెంకయ్యనాయుడు చెప్పిస్తారని, తమ బినామీ ఆస్తులను కాపాడుకోవడానికే మోడీ రూపంలో ఈ ఇద్దరూ వస్తున్నారని కేసీఆర్ వివరించారు.
‘హైదరాబాద్ ఏఒక్క ప్రాంతానికి చెందినది కాదని మోడీ అంటున్నాడు. హైదరాబాద్ మాదికాకుంటే ఎవరిదైతది? నాలుగువందల సంవత్సరాల క్రితం మా తాతముత్తాతలు కట్టిన తహసీల్ తోనే హైదరాబాద్ ఏర్పడింది. నిజాం పేరుమీద కట్టిన ఊరు కాబట్టి నిజామాబాద్ అయ్యింది. కేసీఆర్ చెప్పలేదని అనుకోవద్దు. మోడీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి’. అని కేసీఆర్ స్పష్టం చేశారు. 2009 ఎన్నికలు ముగిసిన వెంటనే హైదరాబాద్ వెళ్ళాలంటే పాస్ పోర్ట్ తీసుకోవాలని వైఎస్ అన్నారని గుర్తుచేశారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతలంతా ఇంతేనని, తెలంగాణపై విషం కక్కాలని చూస్తున్నారని, వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మోడీ ప్రధాని అయితే తెలంగాణకు నష్టం అని కేసీఆర్ తెలంగాణప్రజానీకాన్ని హెచ్చరించారు.
గజ్వేల్ నుంచి పోటీ చేయాలని తాను అనుకోలేదని, పార్టీలకతీతంగా స్థానిక నేతలు కోరినందునే ఒప్పుకున్నానని, గజ్వేల్ దగ్గర ఉన్న ఎర్రవల్లిలోనే భూమి కొనుక్కుని కూరగాయలు పండిస్తున్నానని, ఇల్లు కూడా కట్టుకున్నాను కాబట్టి ఇక్కడే నా శేషజీవితమంతా గడుపుతానని కేసీఆర్ ఆన్నారు. గజ్వేల్ కు ఏదంటే అది చేస్తానని, భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టిందని, రానున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని, తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ రక్షణకవచంలా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ ను గెలిపించుకుంటున్నామని, మిగతా ఎంపీ సీట్లన్నీ మనమే గెలవాలని, సకలజనుల సమ్మెలో తనతో కలిసొచ్చిన ఉద్యోగులు, టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణను కాపాడుకునేందుకు మరోసారి సహకరించి ఎమ్మెల్యే, ఎంపీలను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. సభకు హాజరైన వారిలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బాల్క సుమన్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బీ గణేష్ గుప్తా, చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లాల ఓదెలు, మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు, జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.