అన్ని సర్వేలూ టీఆర్ఎస్ పార్టీదే గెలుపని చెప్తున్నాయని, త్వరలో ఏర్పడేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం నాలుగు జిల్లాల్లో జరిగిన 10బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేతలు ఒక్కరోజైనా జైలుకు వెళ్లలేదని, రాజీనామాలు చేయలేదని, గత్యంతరం లేక ఉద్యమానికి తలొంచి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని అన్నారు. పొన్నాల భూకబ్జాకోరని, గీతారెడ్డి ఫైవ్ స్టార్ మంత్రి అని, జహీరాబాద్ అభ్యర్థి గీతారెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా పొన్నాల టిక్కెట్ ఇచ్చాడని విమర్శించారు.
నరేంద్రమోడీ పిచ్చివాగుడు వాగుతూ ఆంధ్రోళ్లు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను వెంటపెట్టుకుని తిరుగుతూ తెలంగాణలో జీరో అయ్యాడని, నక్కజిత్తుల చంద్రబాబు ఇప్పుడు మోడీ ముసుగులో బొడ్లో కత్తి పెట్టుకుని వస్తున్నాడని, తెలంగాణకు మొదటినుండి చివరివరకూ బాబు అడ్డుపడిన విషయం ప్రజలకు తెలుసన్నారు. బీజేపీకి ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనని, తెలంగాణలో ఇంటిపార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే స్థానాలు ఎంత ముఖ్యమో, ఎంపీ స్థానాలూ అంతే ముఖ్యమని, రెండు ఓట్లూ టీఆర్ఎస్ కే వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అధికారంలోకి రాగానే వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైతే ఇక్కడే కుర్చీ వేసుకుని పనులు పూర్తిచేయిస్తానని హామీ ఇచ్చారు. అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామని, రైతులు తీసుకున్న 300 కోట్ల రూపాయల ప్రైవేటు అప్పులను మాఫీ చేస్తామని, మారటోరియం ప్రకటించి రైతులను ఆదుకుంటామని చెప్పారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఒకనాడు సిరులతో వర్ధిల్లేదని, సీమాంధ్రుల పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కేరాఫ్ గా మారిందని అవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే టెక్స్ టైల్ ఇండస్ట్రీకి మారుపేరుగా సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని, ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వ్యక్తిగత రుణాలు, ప్రభుత్వ రుణాలపై మారటోరియం పెట్టి రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
బలహీనవర్గాల కోసం ఐదువేల ఇండ్లు మంజూరు చేసి, వాటికి స్వయంగా తానే వచ్చి శంకుస్థాపన చేస్తానని పేర్కొన్నారు. బహిరంగసభలకు పాల్గొన్నవారిలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం శ్రీహరి, భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేటీఆర్ తో పాటు నాలుగు జిల్లాల నియోజకవర్గ ఎమ్మెల్యేలు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.