mt_logo

రాహుల్ ఎరగని హైదరాబాద్ వాచీ!

సవాల్ రెడ్డి :

దేశంలో రెండో వాచీ కంపెనీ హైదరాబాద్‌దే

– 1981లోనే తయారైన ఆల్విన్ వాచీలు
– కాంగ్రెస్ సర్కారు ఘనకార్యం వల్లే మూతపడ్డ కంపెనీ

ఇదిగో నా చేయి చూడండి.. నాకు రిస్టువాచీ లేదు. నాకు మేడిన్ తెలంగాణ వాచీ కావాలి. మేడ్ ఇన్ వరంగల్, మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ హైదరాబాద్ అని ఉండాలి… ఇది శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌సభలో రాహుల్ ప్రసంగం. తెలంగాణ అభివృద్ధి చెందాలన్న ఆయన ఆకాంక్షను తప్పుపట్టలేం కానీ, ఆయనకు హైదరాబాద్ పారిశ్రామిక రంగం మీద ఉన్న అవగాహన మీద మాత్రం అనుమానం కలుగుతోంది.

రాకెట్లు తయారు చేస్తున్న హైదరాబాద్ గడ్డ మీద నిలబడి ఇక్కడ వాచీలు తయారు కావాలని, వాటిని తాను ధరించాలని ఆకాంక్ష వెలిబుచ్చడం మాత్రం విస్మయం గొలిపేలాగ ఉన్నది. రాహుల్ కోరిన వాచీలు ఇక్కడ 70వ దశకంలోనే తయారయ్యాయి. దేశంలో ఏర్పాటైన రెండో వాచీ కంపెనీ హైదరాబాద్‌దే. 1970-80 దశకాల్లో ఇక్కడ తయారైన ఆల్విన్ కంపెనీ వాచీలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఈ సంస్థ ప్రవేశ పెట్టిన ఆల్విన్ ట్రెండీ వాచీలంటే యువత ఎగబడేవారు. అంతే కాదు గత కాంగ్రెస్ సర్కార్ల నిర్వాకం వల్లే ఆ కంపెనీ దివాలా తీసి మూతపడింది కూడా. వాస్తవం ఇది కాగా ఇక్కడేదో గుండుసూది కూడా తయారుకాదేమో అన్నట్టు హైదరాబాద్ అభివద్ధి చెందాలి… ఇక్కడి వాచీ నేను ధరించాలి అంటూ రాహుల్ ఆశించడం హైదరాబాదీలకు అవమానకరమే.

ఆల్విన్ వాచీ కథ….

మన దేశంలో తొలి వాచీ ఫ్యాక్టరీ 1961లో బెంగళూరులో ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్‌ఎంటీ జపాన్‌కు చెందిన సిటిజన్ కంపెనీ సహకారంతో దాన్ని ఏర్పాటు చేసింది. రెండో వాచీ కంపెనీ 1981లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్ ఆల్విన్ కంపెనీ సంస్థ జపాన్‌కు చెందిన సీకో కంపెనీతో కలిసి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఆటోమెటిక్ క్వార్ట్జ్ చేతి గడియారాలు తయారు చేసింది. హెచ్‌ఎంటీయే ఈ వాచీలకు మార్కెటింగ్ నిర్వహించింది. ఆల్విన్, హెచ్‌ఎంటీ, టైటన్ వాచీలు దేశంలో వాచీల మార్కెట్‌ను శాసించాయి. ఆల్విన్ కంపెనీనుంచి వచ్చిన ఆణిముత్యాలు ఆల్విన్ పుష్పక్, విజయ్ స్కూటర్లు. ఇవి కూడా దేశవ్యాప్తంగా ఖ్యాతి ఆర్జించాయి.ఇదే కంపెనీ ఇటలీకి చెందిన పియాజియోతో అవగాహన కుదుర్చుకుని వెస్పా 100 సీసీ, 80 సీసీ స్కూటర్లు, మోపెడ్‌లు, త్రీవీలర్లు కూడా ప్రవేశ పెట్టింది. ఇదే కంపెనీ రిఫ్రిజిరేటర్ కూడా ఉత్పతి చేసింది. ఆల్విన్ కంపెనీ రిఫ్రిజిరేటర్ 1970-80 మధ్య దేశంలో అత్యధికంగా అమ్ముడైన బ్రాండ్. దేశానికి స్వాతంత్య్రం రాకముందే అంటే 1942లో హైదరాబాద్‌లో ఆల్విన్ కంపెనీ ఆల్విన్ మెటల్ వర్క్ పేరిట ప్రారంభమైంది.

నిజాం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ట్రస్టు, అలాదీన్ మెటల్ వర్క్స్ అనే ప్రైవేటు యాజమాన్యం సంయుక్త నిర్వహణలో ప్రారంభమైన ఈ సంస్థలో తొలుత ఆల్బియాన్ సీఎక్స్ 9 రకం బస్సులను అసెంబ్లింగ్ చేసేవారు. ఈ బస్సులను నాటి హైదరాబాద్ స్టేట్ రైల్వే (బస్సులు అందులో భాగమే) కొనుగోలు చేసేది. 1952 సార్వత్రిక ఎన్నికల్లో ఆల్విన్ కంపెనీ బ్యాలట్ బాక్సులు వాడారు. హైదరాబాద్ ప్రత్యేకతగా చెప్పే డబుల్ డెక్కర్ బస్సులను తయారు చేసింది ఈ ఆల్విన్ కంపెనీయే.1990 నాటికి కంపెనీ ఆర్థిక పరిస్థితి దిగజారింది. నాటి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు, రాజకీయనాయకులు ఆల్విన్‌ను నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మార్చేశారు.

అవసరం ఉన్నా లేకున్నా భారీ ఎత్తున తమ ప్రాంతం వారిని కంపెనీ ఉద్యోగాల్లో నింపేశారు. పరిశోధన అభివద్ధి పూర్తిగా విస్మరించడం, ఆధునికతను పట్టించుకోక పోవడంతో సంస్థ పోటీకి తట్టుకోలేకపోయింది. 1993 నాటికి రూ.180కోట్ల నష్టం సాకుతో కంపెనీ దివాళా తీసిందని ప్రకటించారు. సంస్థకు చెందిన రిఫ్రిజిరేటర్ విభాగాన్ని తొలుత వోల్టాస్ సొంతం చేసుకుని చివరకు స్వీడన్ కంపెనీ ఎలెక్ట్రోలక్స్ కంపెనీకి అప్పగించింది. స్కూటర్, వాచీ విభాగాలు మూసేశారు. బస్ బాడీ విభాగం మహింద్రా కంపెనీకి అమ్మేశారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *