mt_logo

తెలంగాణ రాష్ట్ర సమితి హామీ పత్రం: లోపించిన సమగ్రత

డి. నరసింహా రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ముందు విడుదల చేసిన తమ హామీ పత్రం లో (manifesto), ముందు మాటలో ఉన్నా చివరి వ్యాక్యం: “రేపు పరిపాలన క్రమంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వెల్లివిరిసేలా ఈ ప్రణాళికను తెలంగాణ మేధావుల, విషయ నిపుణుల భాగస్వామ్యంతో మరింత సమగ్రపరుస్తామని పౌర సమాజం పర్యవేక్షణలో అమలు చేస్తామని సవినయంగా మనవి చేస్తున్నాను” అని హామీ ఇస్తున్నారు శ్రీ.కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంటే, దీని మీద ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం తెరాస గుర్తించింది.

బహుశ సమయాభావం వల్ల సమగ్రత లోపించిన వాస్తవం ముందే అంగీకరించడం ముదావహం. కాని, ఇందులో ఉన్నవి ప్రజల ఆకాంక్షలుగా వర్ణించారు. ఇది సరి అయింది కాదు. ఈ ఎన్నికల ప్రణాళికలో (వారి పదం) ఉన్నా ప్రజలు కోరుకోని ప్రతిపాదనలు అనేకం ఉన్నాయి.

ఆంద్ర వలసవాదుల పాలనలో జరిగిన విధ్వంసం ప్రస్తావనతో మొదలు పెట్టిన ఈ ఎన్నికల ప్రణాళికలో కేవలం ఉద్యోగాలు, నీళ్ళ ప్రాజెక్టుల పట్ల జరిగిన అన్యాయం గురించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. ప్రధానంగా, ప్రకృతి వనరుల యాజమాన్యంలో, నిర్వహణలో జరిగిన అన్యాయాల ప్రస్తావన లేదు. ఇది, తెరాస పార్టీ యొక్క పరిమిత దృష్టికోణాన్ని బయట పెడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రకృతి వనరులను, వాటికి ఉన్న పరిమితులను, స్థానిక ప్రజల నిర్వహణ వ్యవస్థలను, సామాజిక పద్ధతులను అర్థం చేసుకోని పాలన వ్యవస్థ వలన వాటి విధ్వంసం జరిగింది. ప్రకృతి వనరులను ‘వ్యాపార’ వస్తువుగా పరిగణించటం వలన వాటి మీద ఆధారపడిన ప్రజల జీవనం అస్తవ్యస్తం అయింది. తెలంగాణ వ్యవసాయాన్ని, వివిధ జీవనోపాదులను ఇష్టానుసారం, అభివృద్ధి పేరిట పాలన పరంగా మార్చటం వలన అన్యాయమయిపోయింది. ప్రకృతి వనరులను విధ్వంసం చేసే అభివృద్ధి పధ రచనలో వలసవాదుల గణనీయ పాత్ర ఉన్నా, స్థానిక పెత్తందార్ల భాగస్వామ్యం కూడా విస్మరించవద్దు. తెలంగాణ అభివృద్ధి రచన స్థానిక ప్రజల సంస్కృతి పట్ల అవగాహన, ప్రకృతి వనరుల సంరక్షణ పట్ల చిత్తశుద్ధి, స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం అనే మూల సూత్రం ఈ హామీ పత్రంలో లోపించింది.

ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అమలు పర్యవేక్షణకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటిల ప్రతిపాదన తెరాస చేస్తున్నది. ఈ ప్రతిపాదన మంచిదే, కానీ ఆచరణలో దీని పాత్ర ఆయా కమిటిల సభ్యుల మీద, వారి అవగాహన మీద, వారి ఆలోచనలకూ ప్రభుత్వం ఇచ్చే స్పందన బట్టి ఉంటుంది. అదనంగా, రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. ఇదివరకు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉండేది. ఈ బోర్డును పునరుద్ధరణ చేస్తే బాగుంటుంది. ఎట్లాగు, రాష్ట్ర, జిల్లా సలహా పర్యవేక్షణ కమిటీలు, వాటికి సచివాలయంలో ఒక విభాగం ఉండగా, మళ్ళి సలహా మండలి అవసరం ఉండదు.

వచ్చే అయిదు ఏళ్లలో, 72 లక్షల నుంచి 119 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని తెరాస వాగ్దానం చేస్తున్నది. ఇది యెట్లా సాధ్యమయితది? చెరువులు, కుంటలు, కలువల పూడిక ద్వార నీటి నిలువ సామర్థ్యం పెంచడం, చెరువులను, నది జలాలతో అనుసంధానించడం ద్వార ఇది సాధ్యమే అంటున్నది. లక్ష్యం బాగానే ఉన్నా, ఇది ఆచరణ సాధ్యం కానీ వాగ్దానం. ఇటువంటి బృహత్ కార్యక్రమానికి కావాల్సిన మూల ధనం ఒక సవాలు అయితే, నిర్వహణ ఖర్చులు, నిర్వహణ వ్యవస్థ కూడా ఆలోచించాల్సిందే. స్థానిక సంస్థల భాగస్వామ్యం ఎంతైన అవసరం. సుస్థిర నిర్వహణకు కేవలం ఆర్థిక వనరులు మరియు నిర్వహణ సంస్థలే కాకుండా, సమర్ధ మానవ వనరుల అవసరం ఉంటుంది. ఇవన్ని కూడా అయిదేళ్ళలో సాధ్యపడదు. ఇంకా అనేక రకాల అడ్డంకులు వస్తాయి. దీనిమీద పునరాలోచన చేయాలి.

కొత్తగా పది థర్మల్ విద్యుత్తు కేంద్రాలు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన పూర్తిగా తెలంగాణ పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టు. కాలం చెల్లిన టెక్నాలజీ తో విద్యుత్ కొరత తగ్గించవచ్చేమో కానీ, దాని పర్యవసానం చాల తీవ్రంగా ఉంటుంది. తోటి వాడు తోడ కోసుకుంటే, మనం అదే బాటన నడవడం మంచిది కాదు. సింగరేణి బొగ్గు చూసుకుని ఈ ప్రతిపాదన చేసినా, పూర్తిగా బొగ్గు మీద ఆధారపడితే, తెలంగాణ మసి అవడం ఖాయం. తెరాస ఈ ప్రతిపాదన తగ్గించుకోవాలి, లేదా ప్రత్యామ్నాయ పద్ధతులు ఆలోచించాలి. సింగరేణి బొగ్గు నిల్వలు తక్కువ అవుతున్న కొద్ది, తవ్వకం ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు, కార్మికులను బాధపెట్టి, సింగరేణి చుట్టూ గ్రామాల జీవనం అస్తవ్యస్తం చేసి, థర్మల్ కేంద్రాల పరిధిలో పర్యావరణ కాలుష్యం చేసి తెలంగాణ విద్యుత్ కొరత తీర్చేకంటే, విద్యుత్ అవసరం అంచనా వేసి, ఖర్చులు బేరిజు వేసుకుని, ప్రత్యామ్నాయాలు ఆలోచించడం చాల ఉత్తమం.

విద్యుత్ రంగంలో ఉత్పత్తి కొరత ఒక్కటే సమస్యగా తెరాస హామీ పత్రం భావిస్తున్నట్లుంది. విద్యుత్ ఉత్పత్తి పెంపును తెరాస ప్రాధాన్యతగా భావిస్తున్నది. విద్యుత్ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీ, విద్యుత్ సరఫరా వ్యవస్థ, నిర్వహణ, సంస్థాగత వ్యవస్థ, ఆర్థిక అంశాలు (ఉత్పత్తి ఖర్చులు, సరఫరా ఖర్చులు, పెట్టుబడులు, రాయితీలు వగైరా), సరఫరా లోపాలు, విద్యుత్ షాకుతో రైతులు మరియు ఇతరుల మరణాలు, విద్యుత్ సరఫరా ఒప్పందాలు, ప్రైవేటు కంపెనీల లాభాపేక్ష వంటి అనేక అంశాలు పట్టించ్కొనే లేదు. సౌర శక్తికి ప్రోత్సహమిస్తున్నప్పుడు, ఆచరణ సాధ్యం చేసినప్పుడు ఇంకా ఇతర విద్యుత్ టెక్నాలజీ జోలికి పోకపోవడమే మంచిది. 30 శాతం విద్యుత్ సరఫరాలో నష్టపోతునప్పుడు, ఇంకొక 30 శాతం దుబారాగా ఖర్చు పెడుతున్నప్పుడు, విద్యుత్ పొదుపు చర్యలు తీసుకుంటే అవి ఉత్పత్తిని కాపాడుతూ, అదనపు ఖర్చు లేకుండా విద్యుత్ కొరతను తీరుస్తాయి. విద్యుత్ అధికంగా ఉపయోగించే పరిశ్రమలకు ప్రత్యామ్నాయ ఉత్పత్తి పద్ధతులు ఆలోచించాలి. సాధారణంగా, విద్యుత్ అధికంగా అవసరమైన పరిశ్రమలకు నీళ్లు తదితర ప్రకృతి వనరుల ఆవశ్యకత కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రకృతి వనరుల మీద ఒత్తిడి తగ్గించికోవాలంటే, విద్యుత్ రంగ ప్రణాళిక పారిశ్రామీకరణ, పట్టణాభివృద్ధి మరియు జీవన శైలిని నిర్దేశించే ప్రత్యామ్నాయ విధానాల ప్రోత్సాహంతో అనుసంధించాలి. ఉదాహరణకు, తెరాస ప్రతిపాదించిన లైటు రైలు, మెట్రో రైలు వ్యవస్థలు పూర్తిగా విద్యుత్ మీద నడుస్తాయి. ప్రజా రవాణ వ్యవస్థలో వీటి అవసరం ఎంత అని గుర్తిస్తే అంత మేరకు విద్యుత్ అవసరాన్ని నివారించవచ్చు. చేనేతకు ఆలవాలమైన తెలంగాణ రాష్ట్రంలో దానికిచ్చే ప్రోత్సాహం బట్టి ఆధునిక జౌళి పరిశ్రమ ఆవశ్యకత తగ్గించవచ్చు. గ్రామీణ ఉపాధి పెంచవచ్చు.

విద్యుత్ డిమాండ్ తగ్గించడం, విద్యుత్ పొదుపు పాటించడం, సౌర విద్యుత్ ఉత్పత్తి వంటి చర్యలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అప్పుడు విద్యుత్ కొరత తీర్చే అసుస్థిర మార్గాలు అనివార్యంగా ఆలోచిస్తే బాగుంటుంది. తెలంగాణ పునర్నిర్మాణం గట్టి పునాదుల మీద ఉంటుంది.

తెలంగాణాలో వ్యవసాయం మీద తెరాస అనేక ప్రతిపాదనలు చేసింది. అందులో అనేకం బాగున్నా, కొన్నింటిని ఇంకొక విధంగా ఆలోచిస్తే బాగుండేది. తెలంగాణ వ్యవసాయం మన దేశ వ్యవసాయంలో భాగం. తెలంగాణాలో ప్రధానంగా వ్యవసాయ యోగ్య భూమి తగ్గిపోతున్నది – కాలుష్యం వల్ల, నీళ్లు లేక, మట్టి పోర సన్నబడి, జీవ వైవిధ్యం లేక, మంచి భూమి ఇతర అవసరాలకు మళ్ళించబడి వగైర కారణాలతో. సారవంతమైన మట్టిని కాపాడుకోవడం, సారమైన భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. దీనికి తగ్గట్టుగా, చెట్లు, అడవులు, పొదల పెంపకం, పాడి పశువుల పోషణ, పరివాహక ప్రాంతాల పరిరక్షణ, జీవావరణ పెంపుదలకు ప్రోత్సాహం వంటి చర్యలు అత్యంత ఆవశ్యకం. వీటి చుట్టూ ఉపాధి పెంచడం తెలంగాణ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యంగా తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా, పల్లె వాతావరణం పునర్నిర్మాణం చెయ్యాలి. సిక్కిం రాష్ట్రం లాగా, తెలంగాణ రాష్ట్రాన్ని సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రకటించే దిశగా తెరాస పని చేయాలి.

కౌలు రైతుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించవచ్చో తెరాస చెప్పనే లేదు. తెలంగాణ రుణ సౌకర్యం అందని రైతులలో వీరు ప్రథమ స్థానంలో ఉంటారు. రైతులందరికీ, ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోతున్నది అధిక వడ్డీలు వసూలు చేసే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వల్లనే. స్వయం సహాయక్ సంఘాల ద్వార, ఇంకా ఇతర మార్గాల ద్వార, తక్కువ వడ్డికి, లేదా సున్నా వడ్డికి ఋణం అందించే వ్యవస్థ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకోవాలి. తెరాస అటువంటి వాగ్దానం చేసుంటే ఆచరణ మీద నమ్మకం కలిగేది.
సమీకృత వ్యవసాయం చాల అవసరం అని అంతర్జాతీయంగా గుర్తిస్తున్న తరుణంలో, పండ్లకోరకు, పశువుల కొరకు వేరు వేరుగా విశ్వవిద్యాలయాల కంటే, తెలంగాణాలో మూడు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పెడితే ఉపయోగంగా ఉంటుంది. తరువాత, విశ్వవిద్యాలయాలు పెడితే సరిపోదు. వాటిలో, తెలంగాణ ప్రాంతానికి అనుగుణమైన పాఠ్యాన్ని బోధించే వసతులు ఉండాలి. తగిన అంశాలు ఉండాలి.

విత్తన రైతుల మీద, విత్తనాలు కొనే రైతుల మీద విత్తన కంపెనీల దాష్టీకం పెరుగుతున్నది. అందునా తెలంగాణ రైతుల పరిస్థితి మరి దారుణం. బిటి ప్రత్తి విత్తనాలు దాదాపు 70 శాతం అమ్ముడు అయ్యేది తెలంగాణాలోనే. నకిలి విత్తనాలతో, బ్లాకు మార్కెట్ ధరలతో, నాసి రకం విత్తనాలతో అధికంగా నష్టపోయింది ఇక్కడి రైతులు. ఈ నేపధ్యంలో, ప్రత్యెక రాష్ట్ర విత్తన చట్టం చేసే ప్రతిపాదన తెరాస చేస్తే రైతులు సంతోషించేవారు. విత్తన ధరల నియంత్రణ, సత్వర నష్ట పరిహార చెల్లింపు, విత్తన కంపెనీలు, డీలర్ల మీద క్రిమినల్ చర్యలు, జన్యు మార్పిడి పంటల మీద నియంత్రణ వంటి ప్రతిపాదనలు లేకపోవడం తెరాస హామీ పత్రంలో ఉన్న పెద్ద లోపం.

వ్యవసాయ మార్కెట్లలో కూడా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కనీస మద్దతు ధరలు రాస్త్ర స్థాయిలో నిర్ణయించి, దానికి అనుగుణంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతులు మంచి ఫలితాలను సాధించ కలుగుతారు. మార్కెట్ స్థిరీకరణ నిది ఏర్పాటు చేస్తే రైతులకు నమ్మకం ఏర్పడుతుంది. పసుపు, ప్రత్తి లాంటి పంటలలో ఫ్యూచర్ కాంట్రాక్ట్లు రాకుండా నిరోధించాలి. వ్యవసాయాన్ని కార్పోరేటికరణ కాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

పంటల భీమా పథకం తెలంగాణ రైతులకు ఎన్నడూ ఉపయోగపడలేదు. అధిక ఎండలకు, అధిక వానలకు, గాలికి, వరదలకు, కరువుకు, ఇంకా ఇతర ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నష్టపోయినా, వారికి పంటల భీమా ద్వార గాని, ప్రభుత్వం నుంచి గాని నష్ట పరిహారం సరి అయిన సమయంలో, సరిపోయినంత ఎప్పుడూ రాలేదు. రైతులకు మండల స్థాయిలోనే ఈ నష్టపరిహారం అందించే ఏర్పాట్లు ఉంటె బాగుంటుంది. వ్యవసాయ విస్తరణ వ్యవస్థ పటిష్టపరిచి, ప్రభుత్వ సహాయం (ఎరువులు, విత్తనాలు, మూల ధనం, రాయీతీలు) వారికి సత్వరంగా అవినీతి లేకుండా గ్రామ స్థాయి లేదా మండల స్థాయిలోనే అందే ఏర్పాట్లు చేయాలి.

తెలంగాణ లో అనేక ప్రాంతాలలో కోతుల బెడద చాల ఎక్కువగా ఉంది. వాటి దెబ్బతో, రైతులు కొన్ని పంటలు వేసుకోవడమే మానేశారు. వీటిని శాశ్వతంగా అరికట్టాలంటే, సమీప అడవులలో పండ్ల చెట్ల పెంపకం చేస్తే కోతులు అడువులు వదిలిపెట్టవు. అడవుల అభివృద్ధి అనేక విధాలుగా వ్యవసాయానికి ఉపయోగం.

తెలంగాణ రైతులకు ఒక దగ్గర కాకుండా అక్కడింత, ఇక్కడింత ఉండే కమతాల ఏకీకరణ ఆలోచన బాగానే ఉన్నా, ఆచరణలో అది సహకార వ్యవసాయ రూపం తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణాలో సహకార వ్యవసాయం యొక్క ఫలితాలు యేండ్ల నుంచి చూస్తూనే ఉన్నాము. ముల్కనూరు, అంకాపూర్ తదితర అనుభవాలు మన ముందు ఉన్నాయి. ముల్కనూరు ఆద్యుడికి ‘భారత రత్న’ బిరుదు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ తరహ వ్యవసాయం ద్వార ప్రజలకు సేవలు అందిస్తున్న వ్యక్తులకు ప్రత్యెక ప్రోత్సాహం ఇవ్వాలి. సహకార వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తే ఖర్చులు తగ్గి, రైతులు అధిక ఉపయోగాలు పొందే అవకాశం ఉంటుంది. సహకార వ్యవసాయానికి తెరాస ప్రతిపాదనలు చేస్తే బాగుండేది.

ఒకప్పుడు, సహకార రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలు తెలంగాణాలో ఉండేవి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, తెలుగు దేశం ప్రభుత్వ విధానాల వల్ల, అన్ని మూతపడినాయి, ప్రైవేటు పరం అయినాయి. చెరుకు, ప్రత్తి జిన్నింగ్, స్పిన్నింగ్, నూనె మిల్లులు ప్రభుత్వం, లేదా సహకార రంగంలో ఉంటె రైతులకు ఉపయోగం. తెలంగాణాలో సహకర రంగ ప్రోత్సాహానికి తెరాస హామీ పత్రం ప్రతిపాదన చేయడం వలన, తెలంగాణ పునర్నిర్మాణంలో రైతుల పాత్ర గణనీయంగా పెరుగుతుంది.

బెల్లం, పసుపు, చెరుకు, వేరుసెనగ మరియు ప్రత్తి రైతుల వికాసానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యెక చర్యలు తీసుకోవాలి. కేవలం పరిశోధన కేంద్రంతో సరిపెట్టకుండా, ఈ పంటలకు ప్రత్యెక బోర్డులు ఏర్పాటు చేస్తే పరిపాలన దృష్టి కేంద్రీకృతం అవుతుంది. వరి కూడా తెలంగాణాలో ఒక ప్రధాన పంట. జగిత్యాల కేంద్రంగా వరి సాగు మీద పరిశోధనలు చేస్తూ, వరి పంటకు సంబందించిన సమస్యలు పరిష్కరించాలి. నల్ల బెల్లం పండించే రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలి. తెలుగు దేశం ప్రభుత్వం నల్ల బెల్లం గుడుంబ ఉత్పత్తికి పోతున్నది అనే సాకుతో, కామారెడ్డి ప్రాంతంలో ఒక చక్కర పరిశ్రమకు లబ్ది చేకూర్చటానికి, నల్ల బెల్లం ఉత్పత్తి చేసేవారి మీద దమనకాండ చేసి, నిషేదించడం జరిగింది. దీని వలన అనకాపల్లి బెల్లం పరిశ్రమ కూడా లబ్ది పొందింది. నల్ల బెల్లం ఆరోగ్యానికి మంచిది, రైతులకు ఆర్థిక స్వావలంబన కలిగించేది. నల్ల బెల్లం పండించడం ఒక కళ. అది క్రమంగా అంతరించిపోతున్నది.

వ్యవసాయానికి రుణ మాఫి హామీ అవసరం అయినదే. కానీ, తెరాస హామీలో లక్ష రూపాయల వరకు అని పరిమితి విధించడం, కొంత మేర ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నంగా కనపడుతుంది. ఇదే, నిజమైతే, ఇదే హామిని కొంత తిరిగి రాస్తే బాగుంటుంది. వాస్తవంగా, బ్యాంకు రుణాలు చిన్న సన్నకారు రైతులకు ఇచ్చిన పరిమాణం చాల తక్కువ. వీళ్ళు అందరు ప్రైవేటు రుణాల మీద ఆధారపడిన వారే. రుణ మాఫి పథకం వల్ల వాళ్ళకు ఉపయోగం లేదు. తరువాత, కిస్తిలు కట్టిన్వాడికి కాకుండా కిస్తిలు కట్టని వ్యక్తులకు రుణ మాఫి ఉపయోగపడుతున్నది. దీని వలన, నిజయీతిగా ఉండే రైతులకు నిరుత్సాహం. కట్టకుంటే మంచిది అనే అభిప్రాయానికి రావడం మంచిది కాదు. బ్యాంకు ఋణం అందని చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడాలంటే, వాళ్ళ అప్పుల బాధలు తీరాలంటే, అర్హుడైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం నేరుగా, రూ.30,000 మించకుండా, డబ్బు జమ చేస్తే ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంకు ఋణం తీసుకున్న వారికి, కిస్తిలు కట్టేవారికి రుణ మాఫి ముందుగా వర్తింప చేసి, కట్టనివారికి ఋణం రేషేద్యుల్ (లోన్ రెస్చెదులె) చేస్తే అందరికి ఉపయోగం.

భూగర్భ జలాలు తెలంగాణలోని అనేక ప్రాంతాలలో అడుగంటిపోతున్నది. భూగర్భ జలాల ఉపయోగం మీద నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. భూగర్భ జలాల మీద అందరికి హక్కు ఉంటుంది. భూగర్భ నీటి ఊటల సర్వే నిర్వహించి, పరిస్థితిని బట్టి నియంత్రణ నిబందనలు తీసుకు రావాలి. తెలంగాణ భౌగోళిక, సామాజిక, ఆర్థిక, పర్యావరణం, భూమి యాజమాన్యం, కమతాల సైజు మరియు ఆధునిక వ్యవసాయ మార్కెట్ పరిస్థితులు దృష్ట్యా ‘మోట బాయి’ సేద్యం ప్రోత్సహిస్తే అనువుగా ఉంటుంది.

హైదరాబాద్ నగరంలో ఇంకొక విమానాశ్రయం అవసరం లేదు. తెలంగాణ రవాణ వ్యవస్థ మీద దీర్ఘ ఆలోచన చేయాల్సి ఉంది. రోడ్ల నిర్మాణం ఆయా అవసరాల మీద అధ్యయనం చేసి నిర్మిస్తే ఉపయోగం. లేకుంటే, వనరులు దుర్వినియోగం అవుతాయి. హైదరాబాద్ మురికి నీటి మీద ఒక సమగ్ర విధానం ఉండాలి. రోజు రోజుకి పెరుగుతున్న మురికి నీటి జలాల వల్ల, తెలంగాణాలోని రెండు జిల్లాలో అనేక గ్రామాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. వారి వేరే నీటి సరఫరా చేయడంతో సరిపోదు. హైదరాబాద్ ‘విశ్వ’ నగరంగా మారాలంటే, సింగపూర్ లాగ, మురికి నీటిని తిరిగి ఉపయోగించే వ్యవస్థ నిర్మించాలి. తెరాస హామీ పత్రంలో, మురికి నీటిని, చెత్తను పునర్వినియోగించే వ్యవస్థల మీద దృష్టి పెట్టే ప్రతిపాదన లేకపోవడం శోచనీయం. హైదరాబాద్ విస్తరణ కూడా ఆపాల్సిన అవసరం ఎంతైన ఉంది. హైదరాబాద్ మహా నగర ప్రణాళికను 2013 (HMDA Master Plan) తెరాస సమీక్షించి, విస్తరణను రద్దు చేయాలి. ఇది కేవలం రియల్ ఎస్టేట్ సంస్థల బాగు కొరకే అప్పటి ముఖ్యమంత్రి చేసిన ఘోర తప్పిదం. హైదరాబాద్ విస్తరణ వల్ల ప్రపంచ ఖ్యాతి గాంచిన పోచంపల్లి చేనేత పరిశ్రమ కనుమరుగు అయిపోతున్నది. దీని కాపాడుతామని తెరాస వాగ్దానం చేయాలి.

ఇసుక తవ్వకాలు, గుట్టలను పగులగోట్టడం వంటి వాటి మీద కూడా నియంత్రణ అవసరం ఎంతైన ఉంది. తెలంగాణాలోని అనేక గుట్టలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశారు, చేస్తున్నారు. దీని వలన, నీటి పరివాహక వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. ఇసుక క్వారీల మీద కూడా ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల, స్థానిక నీటి వనరుల మీద దుష్ప్రభావం కనపడుతున్నది. వీటి మీద, తెరాస హామీ పత్రం ఎటువంటి ప్రతిపాదన లేదు.

మొత్తం మీద తెరాస హామీ పత్రంలో అనేక ముఖ్యమైన అంశాలు జోడించాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఇందులో ఉన్న కొన్ని ప్రతిపాదనలు సమీక్షించాలి. ఇది వరకు, ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు తావిచ్చిన పరిస్థితులు పునరావృతం కాకుండా పారదర్శక, అవినీతి రహిత పాలనకు తెరాస అంకితం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *