దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు అద్భుతంగా ఉన్నాయంటూ, ఢిల్లీకి చెందిన ఓ యువకుడు కితాబిచ్చారు. కిరణ్ వర్మ అనే 25 ఏండ్ల యువకుడు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ, దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాడు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా తెలంగాణలో పాదయాత్ర చేస్తూ, మంగళవారం కరీంనగర్ చేరుకున్నాడు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న కిరణ్ వర్మను నమస్తే తెలంగాణ పలుకరించింది. గత ఎనిమిది నెలలుగా దేశంలోని కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, గుజరాత్, దాద్రానగర్ హవేలీ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, తదితర రాష్ట్రాల్లో 8,500కిమీలకు పైగా పాదయాత్ర చేశానని వర్మ తెలిపాడు. కానీ ఆ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మాత్రమే రహదారులు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. గ్రామీణాభివృద్ధి కూడా మిగతా రాష్ట్రాలకన్నా తెలంగాణలో అత్యంత మెరుగ్గా ఉందని, నిబద్ధతతో కూడిన పరిపాలనతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ఇలాంటి పరిపాలన అన్ని రాష్ట్రాల్లో ఉంటే భారతదేశం అనతికాలంలోనే ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టి నెం.1 స్ధానంలో ఉంటుందని స్పష్టం చేస్తూ, ముందుకెళ్ళారు కిరణ్ వర్మ.
