mt_logo

తెలంగాణ ఏర్పాటు ఆగదు-కేసీఆర్

గురువారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీతో టీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, ఇతర జేఏసీ నేతలు, టీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని, రాష్ట్రపతి చేతులమీదుగా తెలంగాణ రాష్ట్రాన్ని అందుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీ నుండి కేంద్రానికి వచ్చేట్లు చేసి పార్లమెంటుకు పంపే ప్రక్రియను వేగవంతం చేసినందుకు తెలంగాణ ప్రజలందరి తరపున రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటును ఎవరైనా అడ్డుకుంటే వారిని కట్టడి చేసి ప్రభుత్వాన్ని ఆదేశించి ప్రత్యేక రాష్ట్రాన్ని మీ చేతులమీదుగా మాకు అందించాలని కోరామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అరవై సంవత్సరాలకు పైగా పోరాటం చేసిన ఫలితంగా సిద్ధిస్తున్న తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. రాష్ట్రపతిని కలిసినవారిలో టీఆర్ఎస్ ఎంపీలు వివేక్, మందా జగన్నాధం, జితేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్, మాజీ డీజీపీ పేర్వారం రాములు, శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, సీ.విఠల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *