mt_logo

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ముందుకి

తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్రప్రభుత్వం వెనక్కు తగ్గేది లేదని, సాధ్యమైనంత త్వరగా తెలంగాణ అంశం తేల్చివేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. బిల్లును ఆమోదించకపోతే నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని, పార్లమెంటు దాకా తీసుకువచ్చి ఇప్పుడు వెనక్కు తగ్గితే మంచిది కాదనే నిర్ణయానికి వచ్చింది. సభలో బిల్లును ప్రవేశపెడితే ఒక్కనిమిషం కూడా సభ జరగనివ్వమని హెచ్చరిస్తున్న కొందరు సీమాంధ్ర ఎంపీలను అడ్డుకోవడానికి వ్యూహరచన చేయడంలో అధిష్ఠాన పెద్దలు బిజీగా ఉన్నారు. సభ్యులు ఎంతగా ఆందోళనలు చేసినా పట్టించుకోకుండా సభలో బిల్లును ప్రవేశపెట్టాలని, బుధవారం ప్రవేశపెట్టిన మతహింస నిరోధక బిల్లు ఇందుకు సాక్ష్యమని కేంద్రప్రభుత్వం యోచిస్తుంది. సభలో ఎంత గందరగోళం జరిగినా మతహింస నిరోధక బిల్లుపై కొంత చర్చ జరిగింది. సభ్యులు ఆందోళన చేస్తుంటే ఉభయ సభల సభాధ్యక్షులు ఇద్దరూ తీవ్రంగానే స్పందించి సస్పెండ్ చేస్తామని చెప్పడం ద్వారా సభను నడిపించారు. తెలంగాణ బిల్లుపై కూడా ఇదే విధంగా ముందుకు పోవాలని కేంద్రప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ వైఖరిపై పార్టీ అధిష్ఠానానికి అనుకూలంగా ఉన్న కొందరు సీమాంధ్ర ఎంపీలతో వార్ రూమ్ లో భేటీ అయ్యి వారుచెప్పిన డిమాండ్లను విని సీమాంధ్ర ప్రాంతానికి లాభం చేకూర్చేవిధంగా చేస్తామని చెప్పడంతో వారు అంగీకరించినట్లు తెలిసింది. విభజనకు వ్యతిరేకంగా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉన్నా, అధిష్ఠానానికి అనుకూలంగా నడుచుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంత అభివృద్ధి సాధించుకోవచ్చని భావిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం గం. 1.00 కు జీవోఎం మరోసారి సమావేశమై బిల్లుపై సీమాంధ్ర ఎంపీలు చేసిన ప్రతిపాదనలను పరిశీలించనుంది. సాయంత్రం గం.5.30 ని.లకు జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో జీవోఎం సూచించిన నివేదికలను పరిశీలించిన మీదట రాష్ట్రపతి వద్దకు బిల్లును పంపిస్తారు. రాష్ట్రపతి వద్దనుండి బిల్లు పార్లమెంటుకు చేరుకోవడం ద్వారా ఆమోద ప్రక్రియ మొదలవుతుంది. బిల్లుపై సమైక్యవాదులు గందరగోళం సృష్టిస్తున్న సందర్భంలో ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం సభలో ఒక ముఖ్యమైన ప్రకటన చేయనున్నారు. బిల్లు యొక్క ఉద్దేశాన్ని, ఎందుకు దీనిని సమర్పించనున్నదీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇచ్చిన హామీని ఏ పరిస్థితుల్లో ముందుకు తీసుకువచ్చిందీ ఉభయ సభల్లో వివరిస్తారని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *