mt_logo

తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ కే సాధ్యం- కేసీఆర్

బుధవారం జగిత్యాల నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సంజయ్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ కే సాధ్యమని, రాష్ట్రాన్ని సాధించడానికి ఎలా ఉద్యమం చేశామో అలాగే తెలంగాణ అభివృద్ధికి కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అవినీతిరహిత ప్రభుత్వాన్ని నడిపిద్దామని, కులమతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రతిఒక్కరూ కృషి చేశారని, వచ్చిన తెలంగాణ ఏ ఒక్క వర్గం కోసం కాదని, అన్ని వర్గాలకోసం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కష్టపడ్డవారి నేతృత్వంలోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉత్తపుణ్యానికేం ఇవ్వలేదని, ఎన్నో పోరాటాలు, బలిదానాలు చేసినందుకే ఇచ్చారని, ఇవాళ తెలంగాణ మేమే తెచ్చాం అని చెప్పుకునే వారందరూ మేం ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఉయ్యాలలు ఊగినవారే అని, తెలంగాణ అంశంపై వైఎస్ ఎగతాళిగా మాట్లాడుతుంటే ఆయన పక్కనచేరి నవ్వినవారే అని అన్నారు. ఎవరెన్ని రకాలుగా ఉద్యమం గురించి అవహేళనగా మాట్లాడినా మొండిగా, ధైర్యంగా నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం అని కేసీఆర్ వివరించారు. తెలంగాణలోని అన్ని పొలాలకూ నీళ్లు రావాలని, తెలంగాణ పచ్చబడాలని, కరీంనగర్ లోని ఎస్సారెస్సీ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు అందివ్వవచ్చని, ఈ విషయంలో నారాయణరెడ్డి అనే ఇంజినీర్ తో సర్వేకూడా చేయించానని చెప్పారు. మన తలరాతను మనమే రాసుకునే సందర్భం వచ్చిందని, టీఆర్ఎస్ కే ఓటువేసి గెలిపించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. రాబోయే తెలంగాణ రాష్ట్రంలో మరో 14 జిల్లాలను అదనంగా చేరుస్తామని, జగిత్యాల డివిజన్ ను జిల్లాగా మారుస్తామని అన్నారు. 2001లో ఉద్యమం ప్రారంభించినప్పుడు మొదటిసభ కరీంనగర్ లోనే పెట్టానని, వచ్చే ఎన్నికల ప్రచారసభ కూడా కరీంనగర్ లోనే పెడతానని చెప్పారు. ఈ జిల్లాలో 13 స్థానాలనూ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *