ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలిస్తున్న ప్రధాని మోడీ… నిన్న ఆయుష్ విషయంలో, నేడు రైల్వే లోకోమోటివ్ యూనిట్ విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రస్తుతం దేశంలో కొత్త లోకోమోటివ్ ఫ్యాక్టరీల అవసరం లేదనే సాకుతో తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని ప్రధాని మోదీ ఇపుడు గుజరాత్‌లోని దాహోద్‌లో ఏకంగా రూ.21,969 కోట్లతో బుధవారం లోకోమోటివ్ ఫ్యాక్టరీ యూనిట్‌కు రిమోట్ ద్వారా శంకుస్థాపన చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని 1980లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ వాగ్దానం చేసినా.. 2014 ఏపీ పునర్ విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపరిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కేవలం 6 నెలల్లోనే అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పైనుండి పూటకో మాటతో కేంద్ర మంత్రులు తెలంగాణను అపహాస్యం చేస్తున్నారు. ‘ఇప్పుడున్న కోచ్ ఫ్యాక్టరీలతోనే దేశ అవసరాలు తీరుతాయి’ అని ఓ కేంద్ర మంత్రి పార్లమెంటు వేదికగా ప్రకటించిన కొన్నాళ్లకే మోదీ సర్కారు మహారాష్ట్రలోని లాతూర్‌లో రూ.625 కోట్లతో మరాఠ్వాడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సుమారు 1,484 కిలోమీటర్ల రైల్వే లైన్ల ప్రతిపాదనలను బుట్టదాఖలు చేసింది. హైదరాబాద్ మెట్రో రైలుకు రావాల్సిన రూ.254 కోట్ల వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్)ను కూడా ఇవ్వడం లేదు. 2020లో రూ.1.10 లక్షల కోట్లతో శంకుస్థాపన చేసిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు 2023లో పట్టాలెక్కేందుకు పరుగులు తీస్తుంటే.. హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఏండ్లకు ఏండ్లుగా సర్వేలతోనే ఆపసోపాలు పడుతున్నది.
దేశాన్ని పోషిస్తున్న నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ.. ఏటా పన్నుల రూపంలో కేంద్రానికి లక్షల కోట్లు చెల్లిస్తున్నది. ఈ నిధులను మోదీ గుజరాత్‌కు మళ్లిస్తున్నారు. గత ఏడాది జూలైలో ఒకేరోజు రూ.71 కోట్లతో గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు, రూ.293 కోట్లతో మహాసేన-వరేతన వరకు 55 కి.మీ. గేజ్ మార్పిడి పనులకు, రూ.74 కోట్లతో సురేందర్‌నగర్-పిపావవ్ సెక్షన్ విద్యుద్దీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ, తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-నాగ్‌పూర్ రూట్లలో ఇండ్రస్టియల్ కారిడార్, ఢిఫెన్స్ కారిడార్ లైన్లను మెరుగుపరిచే ప్రతిపాదనలను మాత్రం అటకెక్కించారు. ఇవన్నీ తెలిసినా తెలంగాణ బీజేపీ నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తుండటం, కనీస సోయి లేకుండా ఢిల్లీకి బానిసల్లా కొనసాగుతుండటం తెలంగాణ దౌర్భాగ్యం.