mt_logo

తెలంగాణ ఓ సాంస్కృతిక విజయం..

సాహిత్యంలో పరిచయం అక్కరలేని పేరు అఫ్సర్. కవిగా, కథకులుగా, విమర్శకులుగా చేయితిరిగిన రచయిత ఆయన. అంతర్జాతీయంగా తెలుగువాణిని బలంగా వినిపించే గొంతు ఆయనది. సబాల్టర్న్ స్టడీస్ మీద మరింత స్పృహ పెరుగుతున్న దశలో, అంతర్జాతీయంగా, దేశీయంగా హిందుత్వ శక్తులు బలపడి ముస్లింల ఉనికికే ప్రమాదం ఏర్పడిన సందర్భంలో సాహిల్ వస్తాడు.. కథల సంపుటితో ఒక ధిక్కార స్వరంతో పాఠకుల ముందుకు వస్తున్న సీనియర్ రచయిత డాక్టర్ అఫ్సర్‌తో ముఖాముఖి..

ప్రశ్న.. తెలుగు సాహిత్య ప్రపంచంలో ఎంతో పేరున్న మీరు ఇప్పటిదాకా కథా సంపుటి వేయలేదంటే ఆశ్చర్యం. మీరు ఎలా ఫీలవుతున్నారు?

సమాధానం.. పుస్తకం అనేది నా అజెండాలో ఎప్పుడూ చివరే! నిజానికి ఇప్పటిదాకా ప్రచురించిన నా ఏ పుస్తకం కూడా నా చొరవ వల్ల అచ్చయింది కాదు. మొదటి కవిత్వ పుస్తకం ఖమ్మంలో సీతారాం వల్ల, ఇప్పుడు ఈ కథల పుస్తకం కేవలం ఛాయా మోహన్ బాబు గారి పట్టుదల మాత్రమే! కాని, పుస్తకం కోసం కథలు సేకరించడం మొదలు పెట్టినప్పుడు నాకూ ఆశ్చర్యమే అనిపించింది. కథల సంఖ్య తక్కువే కాని, ప్రతి కథా అది అచ్చయిన సందర్భంలో విస్తృతమైన చర్చకు దారి తీసిందే. 2002 నాటి గోరీమా నుంచి నిన్నమొన్నటి వచ్చేపోయే వాన దాకా! నా కథల్ని చదువరులు సీరియస్‌గా తీసుకున్నారనడానికి అదొక దాఖలా. అంతవరకూ తృప్తి. కథ వర్తమాన సామాజిక సందర్భంలోంచి వచ్చినప్పుడు దాని ప్రభావం అమితంగా వుంటుందనడానికి అదొక ఉదాహరణ.

ప్రశ్న.. గోరీమా కథ నుంచి సాహిల్ వస్తాడు.. కథ దాకా బలమైన ముస్లిం రాజకీయ స్వరాన్ని మీ కథలు వినిపిస్తున్నాయి. ఈ రాజకీయ స్వరం దేనికి ప్రతినిధి?

సమాధానం.. కాలేజీ విద్యార్థి సంఘ నాయకుడిగా వున్నప్పటి నుంచీ నేను వామపక్ష రాజకీయాలవైపే. అయితే, అస్తిత్వ వాదాలు నా మీద బాగా ప్రభావం చూపించాయి. దళిత, స్త్రీవాద వివాదాల్లో నేను క్రియాశీలంగా పాల్గొన్నాను, రాశాను, చర్చించాను. ఆ ప్రభావం నా సృజనాత్మక రచనలపైన కూడా బలంగా కనిపిస్తుంది. అయితే, వ్యక్తిగా నావైన అభిప్రాయాలూ, స్వతంత్ర దక్కోణం కూడా అంతే బలంగా కనిపిస్తాయి. కథల్లోనూ ఆ స్వేచ్ఛ కనిపిస్తుంది. ఆ మాటకొస్తే, స్వేచ్ఛ సాధించడానికే కదా అన్ని రాజకీయ సిద్ధాంతాలూ అనుకుంటా.

ప్రశ్న.. మీరు కవిగా ప్రసిద్ధులు. కథాశిల్పంలో మీ అనుభవాలూ సవాళ్లు ఏమిటి?

సమాధానం.. కవిగా నలుగురికీ తెలిసినా, నేను కథకుడిగానే సాహిత్య యాత్ర మొదలుపెట్టాను. సాహిత్యంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎక్కువగా కథలే రాశాను. కథల అనువాదాలు కూడా చేశాను. కవిత్వంలోకి నాది లేట్ ఎంట్రీ! అట్లాగే జర్నలిజంలో చాలా కాలం పనిచేయడం వల్ల వచన రచన నా రోజువారీ జీవితంలో కూడా పెద్ద భాగమైంది. జర్నలిజంలో నాకున్న అనుభవాన్ని బట్టి చూస్తే, నేను కవిగా బతికి బట్టకట్టడమే గొప్ప. జర్నలిజం అంటే రోజుకు కనీసం పది గంటల పాటు వచనం రాయడమే కదా! అయితే, మిగిలిన వచన రచనలు వేరు, కథ వేరు. ఇంకో కోణం నుంచి బాగా సునిశితంగా చూస్తే, కథాశిల్పం కవిత్వానికి దగ్గిరగా వుంటుంది. అంటే, కవిత్వంలోని క్లుప్తతా, సాంద్రతా, భాషా సౌందర్యం కథకు కూడా అవసరమే. కొద్దిపాటి స్పేస్‌లో అనేక విషయాలు తదేక దృష్టితో చెప్పాల్సిన బాధ్యత కథకుడికీ, కవికీ ఒకేలాంటిది. కథాశిల్పంలో నేను మధ్యే మార్గంలో వెళ్లాను. వాటిల్లో కవిత్వ తీవ్రత ఎక్కువే వుంటుంది.

ప్రశ్న.. తెలంగాణ కథా సముద్రంలోకి పాత నీరు పోయి కొత్త నీరు వస్తున్న ఈ సంధియుగంలో తెలంగాణ కథ మీద మీ అభిప్రాయం ఏమిటి?

సమాధానం.. ముందు- తెలంగాణ కథలో ఇది మీరన్నట్టు సంధియుగంకాదు. అత్యంత నిర్దిష్టమైన దశ. తెలంగాణ కథకు అనేక వన్నెలు అమరిన దశ. 1940ల నుంచి ఇప్పటిదాకా తెలంగాణ కథకు ఒక కొనసాగింపు వుంది. పాతనీరు -కొత్త నీరు అని సాహిత్యంలో స్పష్టంగా గిరిగీసి చెప్పలేం. అవి ఎప్పుడూ కలగలసి ప్రవహిస్తూ వుంటాయి. ఇప్పుడు వస్తున్న తెలంగాణ కథల్లో వైవిధ్యం ఎక్కువగా వుంది. అనేక రకాల జీవన మూలాల్లోకి తెలంగాణ కథకులు ప్రయాణిస్తున్నారు. కథ కొత్తగా చెప్పాలన్న తపన బాగా కనిపిస్తున్నది. తెలంగాణ ముస్లిం కథ ఒక ప్రత్యేక ధోరణిగా బలపడుతున్నది. ఒక్కోసారి మన ప్రయాణం ప్రపంచ ముస్లిం సాహిత్య మలుపులకు దీటుగా కూడా వుంది.

ప్రశ్న.. తెలుగు కథా సాహిత్యంలో ముస్లింలకు వాళ్ళ వాటా వాళ్లకి దక్కలేదన్న విమర్శ నిజమేనా?

సమాధానం.. అవును. కథా సాహిత్యం అనే కాదు, మొత్తంగా సాహిత్యంలోనే ముస్లింల పాత్రను సరిగా బేరీజు వేయడంలో విఫలమయ్యాం. యూనివర్సిటీ స్థాయి పరిశోధనల్లో తూమాటి దోణప్ప, బిరుదురాజు రామరాజు, షేక్ మస్తాన్‌లాంటి పెద్దలు చేసినంత కృషి కూడా ప్రధాన స్రవంతి సాహిత్య విమర్శ రంగంలో జరుగలేదు. ఒకటి రెండు చిన్న పుస్తకాలు రాసిన వాళ్ళ మీద మోనోగ్రాఫులు వచ్చాయి కానీ, ఒక్క ముస్లిం రచయిత గురించి కూడా చిన్న మోనోగ్రాఫ్ లేదు. ఇది తెలంగాణ విషయం మాత్రమే కాదు. అటు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోనూ జరుగుతున్న అన్యాయమే. ఇక అవార్డుల విషయానికి వస్తే, ముస్లింలకు లాబీయింగ్ చేసే వాళ్ళు లేనేలేరు. అవార్డుల జాబితాలో ముస్లిం ఎప్పుడూ చివరే! ముస్లిం రచయితలలో కూడా ఒక విధమైన బెరుకు వుందనే చెప్పాలి. అది మన సాహిత్య సామాజిక సంస్కృతిలోని ఆధిపత్య భావన వల్ల ఇతరులు పెంచిన బెరుకే. ఉర్దూ సాహిత్యంలో హిందూ పేర్లను ఎంత గౌరవంగా తలుచుకుంటారో, అంతటి ఉదారతత్వం తెలుగు సాహిత్యంలో ముస్లిం రచయితల పట్ల లేకపోవడం ఐరనీ.

ప్రశ్న.. ముస్లింవాద సాహిత్యానికి సంబంధించి మీరు ఎలాంటి మార్పును చూస్తున్నారు?

సమాధానం.. కనీసం కొన్ని ముస్లిం పేర్లు ఇప్పుడు కొత్త వెలుగుతో వినిపిస్తున్నాయి. అది ముస్లిం వాదం సాధించిన విజయమే. కాని, ఎంతో పెద్ద పోరాటం చేస్తే తప్ప, ఈ మాత్రం వెలుగు చూడలేకపోవడం విషాదం. అయితే, ముస్లిం వాదానికి ఇంకా సిద్ధాంత పునాది బలపడాలి. ఆఫ్రికా, మధ్య ఆసియా, అరబ్ దేశాల్లోనూ, చివరికి అమెరికన్, బ్రిటన్ సాహిత్య రంగాల్లో ముస్లింలు బలమైన ముద్ర వేశారు. అమెరికన్, బ్రిటన్, యూరప్ సాహిత్య రంగాల్లో ముస్లింలు సాధించిన విజయాలు మనకు ఆదర్శం కావాలి. అది అనేక దశాబ్దాల కృషి అని నాకు తెలుసు. కాని, కనీసం ఒక బలమైన కుదుపు తెలుగు ముస్లింవాద సాహిత్యానికి రావాలి. సృజన, విమర్శ రెండూ బలం పుంజుకుంటే తప్ప ఇది సాధ్యపడదు.

ప్రశ్న.. మిమ్మల్ని మీరు ఎలా గుర్తింపబడాలనుకుంటారు? మెయిన్ స్ట్రీం సాహిత్యకారుడిగానా? లేదా ఒక ముస్లిం సాహిత్యకారుడిగానా? ఎందుకు?

సమాధానం.. మెయిన్ స్ట్రీం సాహిత్యం అనేది లేనే లేదని, అది కేవలం కృత్రిమ సృష్టి అని సాహిత్య చరిత్రల మీద ఆసక్తి వున్న పరిశోధకుడిగా నా ఖచ్చితమైన అభిప్రాయం. ఉదాహరణకు తెలుగు సాహిత్యమే తీసుకుందాం. నన్నయను ఆదికవి అనుకుని, అక్కడి నుంచి మెయిన్ స్ట్రీం సాహిత్య చరిత్ర రాసుకుంటూ వచ్చాం. అట్లా చేస్తున్నప్పుడు ఎంతో విస్తారమైన మౌఖిక సాహిత్యాన్ని పక్కన పెట్టేశాం. ఆ తప్పును ఇప్పుడు సాహిత్య చరిత్రకారులు దిద్దుకుంటున్నారు. అట్లాంటి దిద్దుబాటు ఆధునిక సాహిత్యంలో అడుగడుగునా జరుగాలి. లేకపోతే, పాక్షిక సాహిత్య చరిత్రలే అసలైన సాహిత్య చరిత్రలుగా చెలామణి చేసి, వాస్తవికతకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక నా విషయానికి వస్తే.. నేను రచయితగా మొదలైన 1980లలో ముస్లిం వాదం లేదు. దళిత వాదం, స్త్రీవాదం కూడా లేవు. రచయితగా నన్ను పోషించిన చరిత్ర వేరు. ఆ మూలాలు నాలో ఎప్పటికీ వుంటాయి. కేవలం ముస్లింవాద కోణం నుంచే చూస్తే, నేను మొదట్లో రాసిన రచనలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ కూడా చాలా మంది రక్తస్పర్శ ఇవాళ వంటి నా కవిత్వ సంపుటాల గురించి మాట్లాడే వాళ్ళున్నారు. ఆ పుస్తకాల చరిత్రను నేను నిరాకరించలేను. అట్లాగే, నా చరిత్రనూ నిరాకరించలేను. అవన్నీ నాలో భాగంగానే చూడాలి.

ప్రశ్న.. ఇటీవల తెలుగులో ప్రేమ కథలు విరివిగా వస్తున్నాయి. దీన్ని కొంతమంది కమర్షియల్ సాహిత్యానికి కొనసాగింపుగా భావిస్తున్నారు. సమాజం ఎంతో సంక్లిష్టంగా ఉన్న ఈ సమయంలో సాహిత్యం మరోసారి ప్రేమ వైపు పయనించడం ఎంత వరకు సమంజసం? దీన్ని మీరెలా చూస్తారు?

సమాధానం.. ప్రేమ, కరుణ లాంటివి గొప్ప భావనలు. ఎప్పటికైనా సాంస్కృతిక సాహిత్య రూపాలు చేరుకోవాల్సిన అంతిమ మజిలీలు. వాటి చుట్టూ ఎంత సాహిత్యం వస్తే అంత మంచిది. అయితే, ఆ రెండు భావనలు సామాజికతకు భిన్నంగా నైరూప్యంగా ఎప్పుడూ ఉండవని గుర్తించాలి. పైగా, విద్వేషం పెరిగిపోతున్న సామాజిక సందర్భంలో ప్రేమ అవసరమే. అయితే, అది కమర్షియల్ సాహిత్యంలో ఉండేలాంటి అమ్మాయి- అబ్బాయి ప్రేమ మాత్రమే కాకూడదని నా అభిప్రాయం.

ప్రశ్న.. ఇప్పుడు కవిత్వం కంటే కథలే ఎక్కువగా వస్తున్నాయంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం?

సమాధానం.. కవిత్వం కూడా బాగానే వస్తున్నది కదా! అయితే, కథల్లో వున్న శక్తి వాటిల్లో వుండడం లేదు. ఎందుకంటే, తెలుగు సమాజం మళ్ళీ క్రాస్ రోడ్స్‌లో వుంది. స్థానికత బలమైన భావనగా మారింది. అంతకుముందు ఆ భావన లేదని కాదు. కాని, తెలంగాణ నినాదం వచ్చిన తరువాత స్థానికతకు సిద్ధాంత బలం దక్కింది. అట్లాంటి స్థానికతని వివిధ పొరల నుంచి విప్పి చెప్పే కథలు రావాలి, వస్తున్నాయి. అది ఈ కాలానికి సాహిత్య ధర్మం.

ప్రశ్న.. తెలంగాణ రాష్ట్ర అనంతర సాహిత్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?

సమాధానం.. అనేక విధాలుగా తెలంగాణ సాధన గొప్ప విజయం. ఇది కేవలం రాజకీయ సామాజిక విజయం కాదు. నా మటుకు నేను దాన్ని ఎక్కువగా సాంస్కృతిక విజయంగా భావిస్తాను. తెలంగాణ కేంద్రంగా ఇప్పుడు జరుగుతున్నంత కృషి మామూలు సందర్భంలో అయితే సాధ్యపడేది కాదు. ఇప్పుడు తెలంగాణ సాధించాక రచయితల బాధ్యత ఇంకా పెరిగింది. రచయితల వైపు చూసే జనం పెరిగారు. అవసరమైతే, తెలంగాణ రచయిత అధికార వ్యవస్థల్ని విమర్శించే స్థితి కూడా వుండాలి. రచయితలలో అంత బలమైన వ్యక్తిత్వం వుంటేనే, తెలంగాణ నిలుస్తుంది. లేకపోతే, ఇతర అధికార వ్యవస్థల మాదిరిగానే ప్రజలకు దూరమవుతుంది.

(అఫ్సర్ మొట్టమొదటి కథల సంపుటి సాహిల్ వస్తాడు ఆవిష్కరణ జరిగిన
సందర్భంగా.. డాక్టర్ వెల్దండి శ్రీధర్ ఇంటర్వ్యూ…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *