వ్యర్థ పదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలనలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు రాష్ట్రానికి చెందిన మున్సిపల్ పరిపాలన శాఖ ఉన్నత స్థాయి అధికారుల బృందం ప్రశంసించింది. బుధవారం సాయంత్రం బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను తమిళనాడు అధికారుల బృందం కలిసింది. ఈ సందర్బంగా తమిళనాడు అడిషనల్ సీఎస్ శివదాస్ మీనా మాట్లాడుతూ… వ్యర్థపదార్థాల నిర్వహణ, మున్సిపల్ పరిపాలన రంగంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రశంసించారు. ప్రధానంగా జవహర్ నగర్ లో శాస్త్రీయ పద్దతిలో డంప్ యార్డ్ నిర్వహణ, వ్యర్థాలనుండి విధ్యుత్ తయారీ, భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లు, స్వచ్ఛ్ ఆటోల వినియోగం, స్వచ్ఛ్ కార్యక్రమాలను పరిశీలించామని వెల్లడించారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను తమిళనాడులో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో మున్సిపల్ రంగంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని వివరించారు. వీటిలో ప్రధానంగా ఇంటింటికి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణకై స్వచ్ఛ ఆటోలను ప్రవేశ పెట్టడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో శాస్త్రీయ పద్దతుల అమలు, వేస్ట్ టూ ఎనేర్జి ప్లాంట్ల ఏర్పాటు, నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ల ఏర్పాటు, ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్, ఆస్తిపన్ను మదింపు, పట్టాన ప్రగతి, పల్లె ప్రగతి తదితర ఎన్నోవినూత్న పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అనంతరం, జీహెచ్ ఎంసీ అడిషనల్ కమీషనర్ సంతోష్ ఆధ్వర్యంలో నగరంలో అమలవుతున్న పలు మున్సిపల్ కార్యక్రమాలను ఈ బృందం పరిశీలించింది.