mt_logo

భారతదేశ ప్రగతికి కేసీఆర్ బంగారు బాటలు వేయాలి : మంత్రి కేటీఆర్

భిన్న సంస్కృతుల స‌మ‌హారంగా ఉన్న భార‌త‌దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ లాంటి టార్చ్ బేర‌ర్ ఈ దేశానికి అవ‌స‌రం అన్నారు. కేసీఆర్ భార‌త‌దేశ ప్ర‌గ‌తికి బంగారు బాట‌లు వేయాల‌ని కోరుకుంటున్నాన‌ని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా కేటీఆర్ ప్ర‌సంగించారు. స‌బ్ కా సాత్ స‌బ్ కా వికాస్ అని మోదీ గొప్ప ప్ర‌సంగాలు చేస్తారు.. కానీ మోదీ ప్ర‌భుత్వంలో వికాస్ అన్న‌ది వింత ప‌ద‌మైంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. విద్వేష‌మే నాలుగు పాదాల మీద నుడుస్తోంది. సోష‌ల్ మీడియా ద్వారా సోష‌ల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఒక నిర్మాణాత్మ‌క‌మైన సంస్థ‌లో ఒక కార్య‌క‌ర్త‌గా, మీలో ఒక‌డిగా 75 ఏండ్ల స్వాతంత్ర్యం అనంత‌రం ఒక స‌గటు భార‌తీయుడిగా, ఒక తండ్రిగా భ‌విష్య‌త్ త‌రం గురించి ఆవేద‌న‌తో ఆందోళ‌న‌తో రెండు మాట‌లు మ‌న‌వి చేసుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఈ దేశం పేద దేశంగా ఉండాలి. కుల‌పిచ్చి, మ‌త‌పిచ్చి రేపే సంస్థ‌ల ఎజెండా, రెచ్చ‌గొట్టే ఉద్వేగాల‌కు లోన‌వుదామా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఒక మ‌తానికి సంబంధించి జ‌రిగిన ఊరేగింపులో ఇంకో మ‌తాన్ని కించ‌ప‌ర‌చ‌మ‌ని ఏదేవుడు చెప్పిండు? నా పేరు చెప్పి కొట్టుకు చావండ‌ని ఏ దేవుడు చెప్పిండు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

1987లో చైనా, ఇండియా జీడీపీ ప‌రిమాణం ఒక్క‌టే. కానీ ఈ రోజు మ‌న జీడీపీ 3 ట్రిలియ‌న్ డాల‌ర్లు. చైనా 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు మ‌న త‌ల‌స‌రి ఆదాయం 1800 డాల‌ర్లు ఉంటే.. చైనా 9 వేల డాల‌ర్ల‌కు ఎగ‌బాకిందని కేటీఆర్ తెలిపారు. మేరా భ‌ర‌త్ మ‌హాన్ అనే నినాదాన్ని సాకారం చేసే నాయ‌కున్ని భార‌త‌దేశం కోరుకుంటోంది. ఆ నాయ‌కుడిని తెలంగాణ అందిస్తుంద‌ని మ‌న‌సారా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ‌లో అభివృద్ధి, సంక్షేమం ఏడేండ్ల‌లో సాధ్య‌మైన‌ప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఉద్వేగాల భార‌తం కాదు.. ఉద్యోగాల భార‌తం కావాలి. వ్య‌వ‌సాయ అనుకూల ప‌థ‌కాలు దేశ‌మంతా అమ‌లు కావాలి. డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ కాదు.. గ్రోత్ ఇంజిన్ స‌ర్కార్ కావాలి. గోల్‌మాల్ మోడ‌ల్, బుల్డోజ‌ర్ మోడ‌ల్, బిల్డ‌ప్ మోడ‌ల్ కాదు.. గోల్డెన్ తెలంగాణ మోడ‌ల్ దేశానికి ప‌రిచ‌యం కావాల‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *