mt_logo

నెలవారీ ఆదాయంలో తెలంగాణ పైపైకి… కేంద్రం ఢమాల్

తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం కంటే ముందుందని మరోసారి రుజువైంది. కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వెల్లడించిన వివరాలతోపాటు, తాజాగా మనీ-9 సంస్థ నిర్వహించిన సర్వేలో వ్యక్తుల నెలవారీ ఆదాయం తెలంగాణలో రూ.23,236 కాగా, జాతీయ స్థాయిలో రూ.12,487 మాత్రంగానే ఉంది. అంటే జాతీయ స్థాయి కంటే రెట్టింపు ఉంది. అన్నిట్లో గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో మాత్రం పోటీ పడలేక పోతోంది. అలాగే దేశం మొత్తంగా చూస్తే భారత్‌లో మెజార్టీ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, 46 శాతానికి పైగా కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.15 వేలు మాత్రమే ఉన్నదని సర్వే వెల్లడించింది. దేశంలో ఇప్పటికీ 69% మంది జనాభా ఆర్థిక అభద్రతాభావంతో ఉన్నట్టు పేర్కొన్నది.

మనీ-9 ఫైనాన్షియల్‌ సెక్యూరిటీ ఇండెక్స్‌ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. భారతీయ కుటుంబంలో సగటు కుటుంబ సభ్యుల సంఖ్య 4.2 కాగా.. ఆ కుటుంబం నెలవారీ ఆదాయం రూ.23 వేలుగా ఉన్నదని పేర్కొన్నది. రుణ ఖాతాలు కలిగిన కుటుంబాలు కూడా కేవలం 11 శాతం మాత్రమే ఉన్నట్టు కూడా సర్వేలో తేలింది. 20 రాష్ట్రాల్లో 100 జిల్లాలకు చెందిన 1,154 పట్టణ వార్డులు లేదా గ్రామాలకు చెందిన 31,510 కుటుంబాల శాంపిల్‌తో ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌ వరకు సర్వే నిర్వహించినట్టు మనీ-9 పేర్కొన్నది. భారతీయ కుటుంబాల ఆదాయం, పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు, వ్యక్తిగత రుణాలు తదితర అంశాలపై సర్వే చేశారు.

దేశంలోని 3% కుటుంబాలు మాత్రమే విలాసవంతమైన జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారని సర్వే తెలిపింది. 70% కుటుంబాలు ఏదో విధంగా పొదుపు పాటిస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, బీమా, పోస్టాఫీసు పొదుపులు, బంగారం రూపంలో పొదుపు చేస్తున్నాయి. ఇందులో 64 శాతం పొదుపులు బ్యాంకు, పోస్టాఫీసులలో ఉన్నాయి. 22% కుటుంబాలు స్టాక్‌, మ్యూచువల్‌ ఫండ్‌, యూఎల్‌ఐపీ, భౌతిక ఆస్తులలో పెట్టుబడి పెట్టారని తెలిపింది. అత్యధికంగా 18% మంది రియల్‌ ఎస్టేట్‌లో, మ్యూచువల్‌ ఫండ్స్‌లో 6 శాతం, స్టాక్‌ మార్కెట్‌లో 3 శాతం, యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లలో 3 శాతం పెట్టుబడి పెట్టిన్నట్టు సర్వే పేర్కొన్నది. బ్యాంకుల్లో రుణాలు ఉన్న కుటుంబాలు 11 శాతం మాత్రమేనని సర్వే వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *