mt_logo

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ అగ్రగామి

తెలంగాణ రాష్ట్రంలో పలు రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ 2022 సంవత్సరపు క్యాలెండర్ ను, డైరీని బుధవారం నాడు మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 కోట్ల 75 లక్షల పనిదినాలు కేటాయిస్తే, ఇప్పటివరకు 13 కోట్ల 40 లక్షలు అంటే 97.97 శాతం పనిదినాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దీనికి తోడుగా మరో 2 కోట్ల పని దినాలకు ఈ సంవత్సరంలో అనుమతి లభించిందని వెల్లడించారు. ఉపాధి హామీ పథకం క్రింద రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3 వేల 498 కోట్ల రూపాయల 40 లక్షలు వ్యయం చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా ఈ పథకం క్రింద కూలీలకు 2 వేల 381 కోట్ల రూపాయలు చెల్లించినట్లు మంత్రి తెలిపారు. గ్రామాలలో జీవనోపాధి, మౌలిక వసతుల కల్పనకు 1065 కోట్ల 60 లక్షల రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించామని వివరించారు.

సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం వల్ల ఎన్నో సత్ఫలితాలు సాధిస్తున్నామని… పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఉద్యోగులు, ఉపాధి హామీ ఉద్యోగులు పథకం అమలుకు ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అమలు చేయబడుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి పొందుతున్నారని, ఇప్పుడు వాళ్లకు అవకాశం కూడా దక్కకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని ఆయన తెలిపారు. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 98 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, 2022-23 ఆర్ధిక సంవత్సరం లో 73 వేల కోట్ల రూపాయల కు కుదించడం శోచనీయమైన విషయమని మంత్రి అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి దయాకర్ రావు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *