mt_logo

మారుమూల ప్రాంతాల్లో కూడా కార్పోరేట్ స్థాయి వైద్యమే లక్ష్యం : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలో సైతం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ, శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్‌, చెన్నూర్‌ శాసనసభ్యులు బాల్క సుమన్‌, జిల్లా కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్త్ర మంత్రి మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో ప్రథమ స్థానంలో నిలబెట్టడం జరిగిందని అన్నారు. వైద్య రంగంలో సైతం కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని రాష్ట్రం నలుమూలలా నిరుపేదలకు కూడా అందించేందుకు, వైద్యుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్క వైద్య కళాశాలకు 200 కోట్ల రూపాయలు, ఆసుపత్రికి 300 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్రంలో మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, వనపర్తి మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి 8 ప్రాంతాలలో వైద్య కళాశాలలకు 4 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని వెల్లడించారు. మొదటి విడతలో వైద్య కళాశాలలు, రెండవ విడతలో ఆసుపత్రులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎం.బి.బి.ఎస్‌. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు ప్రధాన ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చేత శంఖుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు మే నెలలోగా అనుమతి ఇచ్చిన అనంతరం ఆగస్టు నెల వరకు కాలేజీ ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని, ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను ఏప్రిల్‌ 15వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా కార్యచరణ రూపొందించామని అన్నారు. వరంగల్‌లో ప్రైవేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని 1100 కోట్ల నిధులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, “హైదరాబాద్‌ పరిధిలో గడ్డిఅన్నారం, అల్వాల్‌, ఎర్రగడ్డ ప్రాంతాలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్క సూపర్‌ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని 800 కోట్ల రూపాయల చొప్పున నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతీ నర్సింగ్‌ కళాశాలను 40 కోట్లతో 14 నర్సింగ్‌ కళాశాలలను 560 కోట్ల నిధులతో నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు దాదాపు 10 వేల కోట్ల రూపాయల ప్రణాళికతో ముఖ్యమంత్రి ముందడుగు వేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేటాయించిన వైద్య కళాశాల నిర్మాణంపై జిల్లా కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి త్వరితగతిన నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చే విధంగా సహకరించాలని తెలిపారు. ప్రతి కళాశాలలో తరగతికి 150 అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఏరియా ఆసుపత్రిలో 275 పడకలు, మాతా, శిశు కేంద్రంలో 100 పడకలు అందుబాటులో ఉన్నాయని, వీటి సంఖ్య మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *