mt_logo

ఉన్నతస్థాయి ప్రమాణాలతో మన ఊరు – మన బడి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఉన్నతస్థాయి విద్యా ప్రమాణాలతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అమలు చేయబోతోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం మన ఊరు – మన బడి కార్యక్రమంపై విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈ పథకం విద్యారంగంలో దేశానికి ఆదర్శం కానుందని అన్నారు. పాఠశాలల రూపురేఖలను మార్చడంతో పాటు నూతన ఒరవడిని సృష్టించబోతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని టీసీఎస్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. పాఠశాలల వారీగా జాబితా రూపొందించి త్వరితగతిన పూర్తిస్థాయి నివేదికను అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను 7,289.54 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదని, తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 9,123 పాఠశాలల్లో 12 రకాల కనీస సౌకర్యాలను కల్పించడానికి 3,497.62 కోట్లను ఖర్చు చేయబోతున్నామని వివరించారు. ప్రతీ జిల్లాలోనూ స్థానిక ప్రజా ప్రతినిధులు తమ పరిధిలో ఉన్న పాఠశాలలపై ప్రత్యేకమైన దృష్టి సారించి, స్వయంగా పర్యవేక్షించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్కూళ్ళ అభివృద్ధి వల్ల ఆంగ్ల మాధ్యమంతోపాటు, నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చి పేద వర్గాల పిల్లల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించే అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని మంత్రి అన్నారు. త్వరలోనే జిల్లా స్థాయిలో మంత్రులు స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన , టిఎస్‌ఈడబ్ల్యూఐడిసి ఎండి పార్థసారథి, టిసిఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *