వైద్యారోగ్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసేందుకు సిద్దమయింది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే దవాఖానలో క్యాన్సర్ రోగులకు రోబో ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన, అంత్యంత ఖర్చుతో కూడిన అత్యాధునిక రోబో శస్త్ర చికిత్స నిరుపేదలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానలో రోబో సేవలకు శ్రీకారం చుట్టారు. కాగా రూ.30 కోట్ల వ్యయంతో రోబోను ఎంఎన్‌జే దవాఖానలో ఏర్పాటు చేయనున్నట్టు ఎంఎన్‌జే హాస్పటల్ డైరెక్టర్ జయలత వెల్లడించారు. రెండు నెలల్లో రోబో దవాఖానకు చేరుతుందని, ఇప్పటికే దవాఖాన పాత భవనంలోని రెండవ అంతస్తులో రోబోటిక్ ఆపరేషన్ థియేటర్ సిద్ధమైందని చెప్పారు. రోబోటిక్ సర్జరీలపై దవాఖానలోని నలుగురు సీనియర్ సర్జికల్ అంకాలజిస్టులకు శిక్షణ ఇచ్చామని వివరించారు. సాధారణ పద్దతుల కంటె రోబో ఆపరేషన్ థియేటర్ ద్వారా రోజువారీ శస్త్ర చికిత్సల సంఖ్య పెరగనుందని జయలత తెలిపారు. దక్షిణ భారత దేశంలోనే ప్రభుత్వ దవాఖానల్లో రోబో చికిత్సలు ఎంఎన్‌జేలోనే తొలిసారి అని పేర్కొన్నారు.
రోబోటిక్ చికిత్స అంటే…
సాధారణ, లాపరోస్కోపిక్ వంటి సర్జరీలను వైద్యులు నేరుగా చేస్తారు. రోబోటిక్ విధానంలో మానవ స్పర్శ లేకుండానే శస్త్ర చికిత్స జరుగుతుంది. మైక్రోస్కోప్ ద్వారా వీడియోలో చూస్తూ రోబోను ఆపరేట్ చేస్తారు. వీడియోలో చూస్తూనే రోబోకు వైద్యులు రిమోట్ ద్వారా సంకేతాలు ఇస్తారు. ఆ సంకేతాల ఆధారంగా రోబో చేతులు రోగి శరీరంలోని క్యాన్సర్ కణతులను తొలగించడం వంటి పనులు చేస్తాయి. రోబోతో రోగి శరీరంపై ఎలాంటి కోత లేకుండానే చిన్నపాటి రంధ్రం ద్వారా శస్త్ర చికిత్స చేస్తారు. దీనివల్ల రోగి త్వరగా కోలుకొంటాడు. చేయి కూడా వెళ్లలేని సూక్ష్మ అవయవ భాగంలో కూడా రోబో ద్వారా శస్త్రచికిత్స చేయవచ్చని ఎంఎన్‌జే డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు.ఊపిరితిత్తులు వంటి అతి సున్నితమైన భాగాల్లో ఎలాంటి గాటు లేకుండా చిన్నపాటి రంధ్రం ద్వారా సర్జరీ చేయవచ్చని వివరించారు.