mt_logo

ఆరోగ్య తెలంగాణ దిశగా పరుగులు తీస్తున్న వైద్యరంగం 

పేదలకు ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు.. ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఓవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్ఠం చేస్తూనే, మరోవైపు జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో వైద్యవిద్యను ప్రోత్సహిస్తూ ఉత్తమ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నది.

రాష్ట్ర వ్యాప్తంగా కిశోర బాలికలు, గర్భిణుల్లో రక్త హీనతను నివారించేందుకు వైద్యారోగ్య శాఖ ‘ఏ షీల్డ్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఆశా కార్యకర్తలు, మెడికల్‌, పారామెడికల్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో గర్భిణులకు, బాలికలకు, మహిళలకు ‘ఏ షీల్డ్‌’లోని టెస్ట్‌ కిట్‌ ద్వారా రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తారు. 14 నుండి 55 సంవత్సరాలలోపు వారిని పరీక్షించి, ఎవరిలోనైనా రక్తహీనత గుర్తిస్తే వెంటనే అవసరమైన మందులు అందిస్తున్నారు. పోషకాహారంపై అవగాహన కల్పిస్తారు. గర్భిణులకు ప్రసవం వరకు తరుచూ పరీక్షలు నిర్వహిస్తారు. హైరిస్క్‌ వారిని గుర్తించి, మెరుగైన వైద్యం అందించేందుకు ప్రధాన ఆసుపత్రుల్లో నిపుణులైన గైనకాలజిస్టులను నియమించారు. కౌమారదశ బాలికలకు నెలసరిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను రక్తహీనత లేని జిలాలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వం లక్ష్యం. అనీమియా ముక్త్‌ కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలుపర్చడానికి అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుబోధ్‌ బృందంతో వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షలు, ఫలితాలు, ఫాలోఅప్‌ చర్యలను వైద్యశాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ‘ఏ షీల్డ్‌’ పేరుతో యాప్‌ అబివృద్ధి చేశారు.

వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల. దీని అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఒకేసారి 8 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించి వైద్యవిద్య చరిత్రలో సువర్ణాధ్యాయన్ని లిఖించారు. మరో రెండేండ్లలో 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు సాకారం కానున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అదనంగా 1,150 సీట్లు సాధించి దేశ చరిత్రలోనే ఒక అడుగు ముందు కు వేసింది. స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్లలో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, రామగుండం, మహబూబాబాద్‌ జిల్లాల్లో వైద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రం ఏర్పడినప్పుడు 850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా నేడు 2,790 కి పెరగడం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. దీనికి సమాంతరంగా జిల్లాకు ఒక నర్సింగ్‌ కాలేజీ, అవసరం ఉన్నచోట పారామెడికల్‌ కాలేజీల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించవలసిన అగత్యం తప్పింది.

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో 10వేల సూపర్‌ స్పెషాలిటీ పడకల దిశగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే నిమ్స్‌లో 1,800 పడకలు ఉన్నాయి. అదనంగా విస్తరణ కోసం రూ.1,571 కోట్లు మంజూరు చేసింది. వీటితో మరో 2,000 పడకలు అందుబాటులోకి వస్తాయి. దీనికి తోడు నగరం నాలుగు వైపులా నాలుగు టిమ్స్‌లు ఏర్పాటుచేయడం ద్వారా 4 వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. వరంగల్‌లో నిర్మిస్తున్న హెల్త్‌ సిటీతో మరో 2 వేల పడకలు వస్తాయి. ఇలా మొత్తంగా సుమారు 10 వేల సూపర్‌ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి రానున్నాయి. నిమ్స్‌లో ఏర్పాటు చేయనున్న 2,000 పడకల్లో 500 ఐసీయూకు కేటాయిస్తారు. మొత్తం 42 విభాగాల డాక్టర్లు అందుబాటులోకి రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *