mt_logo

మోదీజీ… తెలంగాణాకేది వందేభారత్ రైలు ?   

కేంద్రం తెలంగాణపై అన్నిరంగాల్లో వివక్ష చూపుతోందని వందేభారత్‌ రైలు విషయంతో మరోసారి రుజువయ్యింది. ఈ హైస్పీడ్‌ రైళ్ల కేటాయింపులో తెలంగాణ పట్ల కేంద్రానికున్న సవతి ప్రేమ స్పష్టమవుతున్నది. ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్లు ఎడాపెడా కేటాయించి, దక్షిణ మధ్య రైల్వే జోన్‌ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభించడానికి కేంద్రం ముందుకు రాకపోవడమే దీనికి సాక్ష్యం. 

ఈ నెల 10న చెన్నై-బెంగళూరు వందేభారత్‌ రైలును స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ రైలును ప్రారంభించిన రెండు వారాలలోనే.. కర్ణాటకలోని బెంగళూరు-మైసూరు మధ్య మరో వందేభారత్‌ రైలు ప్రారంభించడానికి కేంద్రం ఆదేశాలతో రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. డిసెంబర్‌ నెలాఖరులోగా ఈ వందేభారత్‌ రైలును భారత ప్రధాని ప్రారంభించబోతున్నట్టు సికింద్రాబాద్‌ డివిజనల్‌ రైల్వే వర్గాలు తెలిపాయి. సికింద్రాబాద్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంపై దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని పలు రైల్వే ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

సికింద్రాబాద్‌ నుంచి కాకుండా.. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలోని విశాఖపట్నం నుంచి తిరుపతికి, లేదా విశాఖపట్నం నుంచి విజయవాడకు వందేభారత్‌ రైలును వేయనున్నట్టు ఇప్పటికే వాల్తేరు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఒక ప్రైవేటు టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈసరికే ఏడు రాష్ట్రాలకు వందేభారత్‌ ప్రకటించిన కేంద్రం తెలంగాణను ఎందుకు మరచిపోయిందని రైల్వే ఉద్యోగులు, రైల్వే ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.

ఒక పక్క వందేభారత్‌ రైళ్లను తెలంగాణ పొరుగు రాష్ట్రాలకు కేటాయిస్తుంటే.. మరోపక్క రాష్ట్రానికి చెందిన కేంద్ర సహాయక మంత్రి కిషన్ రెడ్డి మాత్రం త్వరలోనే సికింద్రాబాద్‌కు వందేభారత్‌ రైలు వస్తుందని, ఇప్పటికే తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయని మాటలతో సరిపుచ్చుతున్నారని పలువుర విమర్శిస్తున్నారు.

రైల్వే జోన్‌లలో అతిపెద్దదైన దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కాదని, పొరుగు రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ సానుభూతి పార్టీలు అధికారంలో కొనసాగుతున్న రాష్ట్రాలకు మాత్రమే వందేభారత్‌ రైళ్లు కేటాయించడం మంచిది కాదని పలువురు రైల్వే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సికింద్రాబాద్‌ నుంచి వందేభారత్‌ రైళ్లు ప్రారంభించాలని, ఆ మేరకు రైల్వే ట్రాక్‌ల స్పీడ్‌ సామర్థ్యం పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *