శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి. రైతు సమస్యలపై గత రెండు రోజులుగా శాసనసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని వివరించారు. గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ఆరోగ్యలక్ష్మి పథకం చేపట్టామని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా 30,700 అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని, ఖాళీగా ఉన్న అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదిలాఉండగా మంత్రి తుమ్మల మాట్లాడుతున్నప్పటికీ సభ్యులు వినిపించుకోకుండా గందరగోళం సృష్టించడంతో సభ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.