శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని, పేకాటలు ఆడుతున్నారని అన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందిస్తూ పేకాట క్లబ్ లను నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, దేశంలో పేకాట క్లబ్ లను మూయించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పోలీసులను అవమానిస్తోంది. పోలీసులు ప్రాణాలకు తెగించి మనకు భద్రత కల్పిస్తున్నారు. మీకు అందరికీ గన్ మెన్ లు లేరా? వారు మీకు రక్షణ కల్పించడం లేదా? అటువంటి పోలీసులను కించపరచడం సబబా? అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్ఠంగా ఉందని, హైదరాబాద్ లో ఉన్న పోలీస్ వ్యవస్థ మరెక్కడా లేదని చెప్పారు. పోలీస్ వ్యవస్థపై అనవసరపు మాటలు మాట్లాడొద్దని, వాస్తవాలు మాట్లాడాలని హరీష్ రావు సూచించారు. పోలీస్ వ్యవస్థను కించపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు తెలంగాణ పోలీసులకు క్షమాపణ చెప్పాల్సిందేనని హరీష్ రావు డిమాండ్ చేశారు.