mt_logo

ఆరోగ్యసూచిలో తెలంగాణ 3వ స్థానంలో.. : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను వెంకయ్య అభినందించారు. బుధవారం హైదరాబాద్ లోని మాదాపూర్‌లో భారత సంతతి అమెరికా వైద్యుల సంఘం(అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్) ఆధ్వర్యంలో 15వ ‘గ్లోబల్‌ హెల్త్‌కేర్‌ సమ్మిట్‌’ జరిగింది. ఈ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. గతేడాది గుణపాఠాలను దృష్టిలో పెట్టుకుని కోవిడ్ నియమాలు పాటిస్తూ మనల్ని, మన సమాజాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధర్మమని చెప్పారు. కోవిడ్ నివారణకు కేంద్రం రెండు కొత్త వ్యాక్సిన్ లు, యాంటీ వైరల్ డ్రగ్స్ కి ఇటీవల అనుమతిచ్చిందన్నారు. కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత వైద్యులదేనని సూచించారు. దేశంలో రోజురోజుకు మెడికల్‌ టూరిజం పెరుగుతోందని, గ్రామీణ ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో భారత్‌ అద్భుత ఫలితాలు సాధిస్తోందన్న ఉప రాష్ట్రపతి.. అర్బన్ ప్రాంతాల్లో ప్రపంచ దేశాల నుంచి మన దగ్గరికి రోగులు వస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు అందక ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరమన్నారు. టెలి మెడిసిన్ సేవలద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని వెంకయ్య అన్నారు. ఆన్లైన్ కన్సల్టేషన్, ఆన్ లైన్ మెడిసిన్ డెలివరీ సేవలు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మెషిన్ ద్వారా రోగుల మెడికల్ రికార్డ్స్ ని డిజిటల్ చేయవచ్చని చెప్పారు. సీపీఆర్ ద్వారా హార్ట్ అటాక్ వంటి సమయాల్లో మనుషులను కాపడుకోగలమని, వీటిని పాఠశాల స్థాయిలోనే ఫస్ట్ ఎయిడ్ సేవలతో పాటు నేర్పించాలని చెప్పారు. రోగులకు వైద్య సేవలు అందించే సమయంలో చూపే మానవత్వం, ప్రేమే ముందుగా రోగాన్ని తగ్గిస్తుందన్న విషయాన్ని మరవద్దని ఉపరాష్ట్రపతి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *