mt_logo

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుదాం : మంత్రి కేటీఆర్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మరియు వివిధ విభాగాలకు చెందిన శాఖాధిపతులతో మంత్రి కేటీఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల ప్రక్రియపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియ పైన అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ప్రభుత్వ శాఖాధిపతుల కృషివలన అగ్రస్థానంలో నిలిచామని, ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిచేలా కృషి చేద్దామన్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100% సంస్కరణలు, చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ఈసారి రానున్న ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని, ఈ విషయంలో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ విధానాలు ఇక్కడి అధికారులు చొరవ వలన రాష్ట్రానికి అనేక పెట్టుబడులు విజయవంతంగా వస్తున్నాయని, తద్వారా ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం పొందేందుకు మనమంతా కలిసి ప్రయత్నం చేద్దామని అధికారులను కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పనిచేయడం అంటే పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదని, తమ తమ శాఖలు విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు. తమ విభాగాలను బలోపేతం చేసుకుంటూనే మనమంతా తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్ర స్థానం దక్కడం ఖాయమని, ఈ దిశగా పని చేద్దామని మంత్రి అన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన 300కు పైగా సంస్కరణలు, చర్యలు పూర్తి అయ్యాయని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా శాఖల వారీగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *