ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు అందించే వాటర్ గ్రిడ్ పథకానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్(టీడీడబ్ల్యూఎస్సీ) అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇకపై వాటర్ గ్రిడ్ పనులన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయి. మంగళవారం సచివాలయంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ పథకం దేశానికే ఆదర్శంగా నిలవాలని, ముఖ్య గ్రామాలతో పాటు ఆదివాసీ గుడిసెలు, గిరిజన తండాలు, ఎరుకల, గంగిరెద్దుల గుడిసెలకు అన్నిటికీ మంచినీరు అందించాలని, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను ఇకపై ప్రతివారం సమీక్షించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు తాగునీరు కనీస హక్కు అని, ప్రజలందరికీ మంచినీళ్ళు అందించే విషయాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, వచ్చే 15ఏళ్ల కాలానికి సరిపడా మంచినీటిని సరఫరా చేసేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ మరో 30 ఏళ్ళ వరకూ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. డ్రింకింగ్ వాటర్ పథకాన్ని త్వరగా పూర్తిచేసేందుకు గానూ కావాల్సిన ఇంజినీర్లను రాష్ట్ర పబ్లిక్ కమిషన్ ద్వారా నియమించుకోవడానికి పంచాయితీ రాజ్ శాఖకు సీఎం అనుమతి ఇచ్చారు. డ్రింకింగ్ వాటర్ పైపు లైన్ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ విధివిధానాలను ఖరారు చేశారు. రాష్ట్రంలో పైపులను ఉత్పత్తి చేసే కంపెనీలకే పనులు ఇవ్వాలని, వాటికి సంబంధించిన అన్ని పనులనూ ఆ కంపెనీలే పదేళ్ళపాటు చూసుకునేలా బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
పట్టణాలలో వివిధ వాడలకు నీటిని తరలించేందుకు అవసరమయ్యే ఇంటర్నల్ పైపు లైన్ లను నిర్మించుకునే బాధ్యత ఆయా మున్సిపాలిటీలదేనని చెప్పారు. గోదావరి నుండి హైదరాబాద్ కు మంచినీళ్ళు తరలించే క్రమంలో మూడుచోట్ల రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుందని అధికారులు సీఎంకు చెప్పగానే ఆయన వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో ఫోన్ లో మాట్లాడారు. తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు సహకరించాలని, పైపులైన్లు రైల్వే ట్రాక్ లను దాటే చోట్ల వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరగా దానిపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, గ్రామీణ, మున్సిపల్, నీటిపారుదల శాఖల ఇంజినీరింగ్ అధికారులు, పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.