mt_logo

చెరువులతోనే కరువుకు తెర..

-ఇదే స్ఫూర్తితో మిషన్ కాకతీయ
-ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్‌బండ్
-చెరువు అంటే సాంస్కృతిక వైభవం.. ఉద్యమంలా చెరువుల పునరుద్ధరణ
-టీ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి హరీశ్‌రావు
-నా వంతు సహకారం అందిస్తా: ప్రజా గాయకుడు గద్దర్
-దేశంలో అత్యధిక చెరువులు తెలంగాణలోనే

చెరువుల పునరుద్ధరణతో కరువు మటుమాయం అవుతుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూగర్భ జల సంపద పెరిగేలా, రైతాంగానికి మూడు కాలాల్లో పనులు దొరికేలా మిషన్ కాకతీయను చేపట్టనున్నామని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో శాతవాహనుల కాలంనుంచే చెరువులు ఉన్నాయని మంత్రి చెప్పారు. కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువులు మహర్దశను అనుభవించాయని వివరించారు. హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్‌గా ప్రఖ్యాతి పొందిన విషయాన్ని గుర్తుచేశారు.

కానీ.. చెరువుల ప్రాధాన్యం తెలియని సీమాంధ్ర పాలకుల నిర్వాకం వల్ల అవి నాశనమైపోవడమేకాకుండా.. దాని ఫలితంగా తెలంగాణలో వలసలు, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసేందుకు కంకణం కట్టుకుందని వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణను ఉద్యమంలా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు ఆచరణ రూపమిచ్చి విజయవంతం చేస్తామని, లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు.

మంగళవారం టీ న్యూస్ చానల్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో హరీశ్‌రావు మిషన్ కాకతీయ లక్ష్యాలను వివరించారు. చెరువులు కుల వృత్తులకు ప్రాణాధారం. చెరువు అంటే సాంస్కృతిక వైభవం. కరువును పారదోలేందుకే మిషన్ కాకతీయ. తెలంగాణ ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల గురించి పోరాడారు. దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రం తెలంగాణ. అసలు రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయని ముఖ్యమంత్రి సర్వే చేయిస్తే 46 వేల చెరువులు ఉన్నట్లు తేలింది.

ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్‌గా పేరుగాంచింది. వేయి సంవత్సరాల కిందట కాకతీయుల కాలంలోనే వీటిని నిర్మించారు అని హరీశ్ చెప్పారు. సీమాంధ్ర పాలకులు చెరువుల మరమ్మతులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో, ప్రస్తుతం ఈ దుర్భర స్థితి తలెత్తిందని అన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువుల పునరుద్ధరణకు రూ.20 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

ప్రభుత్వ కార్యక్రమంలా ఉండకూడదు..
చెరువుల పునరుద్ధరణ.. ప్రభుత్వ కార్యక్రమంలా, ఇరిగేషన్ డిపార్టుమెంట్ కార్యక్రమంలా ఉండకూడదని, ఉద్యమం తరహాలో ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తాను ఎప్పటికీ మర్చిపోలేనని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. చెరువు బాగుంటే మత్య్సకారులు, రజకులు, కల్లుగీత కార్మికులకు ఉపాధి దక్కుతుందన్నారు. గొర్రెలు, మేకలు, పశువులు కూడా బాగుంటాయని, వాతావరణ సమతుల్యత మెరుగుపడుతుందని చెప్పారు. పాత రోజుల్లో చెరువుల్లో ఈత నేర్చుకునే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి వివరించారు.

బతుకమ్మలతో చెరువులకు..
బతుకమ్మ పండుగనాడు ఊరంతా ఒక చోటకి చేరుతుందని, బతుకమ్మ పండుగ ఎంత బాగా జరుపుకుంటామో అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. గణేశ్ నిమజ్జనంనాడు అందరూ కలిసేది చెరువుదగ్గరేనని చెప్పారు. చెరువు తెలంగాణ ప్రజల జీవనంలో ఒక భాగమన్నారు. వలసలు, రైతుల ఆత్మహత్యలు పెరగడానికి చెరువులను నాశనం చేయడమే కారణమన్నారు. చెరువుల పునరుద్ధరణవల్ల ఎలాంటి భూసేకరణ సమస్య కానీ, లిటిగేషన్ వ్యవహారాలు కానీ ఉండవన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీలు కేటాయించారని, దీనిద్వారా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీశ్ వివరించారు.

ఒక నాగార్జునసాగర్ అంతటి ప్రాజెక్ట్ కడితే ఎంత సామర్ధ్యంలో నీళ్లు వస్తాయో అంతలా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. పునరుద్ధరించనున్న అన్ని చెరువుల్లో భూసార పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. పూడిక తీసిన మట్టిని పొలాలకు తరలించకముందే పరీక్ష జరగడం మంచిదని అన్నారు. ముందుగానే ఇలాంటి పరీక్షలు చేయిస్తే దాని సారం ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఈ విధంగా పరీక్ష చేయించడంవల్ల మెదక్ జిల్లా జిన్నారం మండలంలో ఫార్మా పరిశ్రమలవల్ల రెండు చెరువుల్లోని మట్టి పనికిరాదని తేలిందన్నారు.

నల్లగొండ జిల్లా మునుగోడులో ఫ్లోరోసిన్‌వల్ల అక్కడ మట్టి పనికిరాదని స్పష్టమైందన్నారు. ఇటువంటి మట్టిని గుర్తించిన ప్రభుత్వ స్థలానికి తరలిస్తామన్నారు. మంచి పూడిక మట్టిని పొలాల్లో చల్లుకుంటే రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుందని మంత్రి చెప్పారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు రెండేండ్లక్రితం వరంగల్ జిల్లాలో నిర్వహించిన ఒక పరీక్షలో చెరువు పూడిక మట్టిని వాడడంవల్ల రైతు రూపాయి ఖర్చు పెడితే, రూపాయి నలభై నాలుగు పైసలు అదనపు ఆదాయం వచ్చినట్లు తేలిందన్నారు. ఈ మట్టి వాడిన భూమిలో తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పారు.

అన్ని శాఖలతో సమన్వయం….
మిషన్ కాకతీయలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకుంటున్నామని హరీశ్‌రావు తెలిపారు. ఇటీవలే వ్యవసాయ శాఖకు చెందిన 440 మంది అధికారులను సహచర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ప్రత్యేక సమావేశపర్చామన్నారు. ఎఫ్‌టీఎల్ ధ్వంసమైన చెరువులను రెవెన్యూ రికార్డు ప్రకారం గుర్తించేందుకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకుంటున్నామన్నారు. చెరువు చుట్టూ మంచి మొక్కలు నాటే పనిని అటవీ శాఖకు అప్పగించామని చెప్పారు. చెరువుల పునరుద్ధరణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వడంతోపాటు, వీలైనంతవరకు సెలవు రోజుల్లో శ్రమదానం చేసేందుకు ముందుకొస్తున్నారని తెలిపారు. ఇది చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. గతంలో ఒక చెరువు కట్ట తెగితే మరమ్మతులు చేసేందుకు కనీసం రెండు, మూడు నెలలు పట్టేదని, ఇప్పుడు తాము సరళీకరించిన విధానం ప్రకారం వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతున్నదని మంత్రి వివరించారు. ఈఈ స్థాయిలో రూ.50 లక్షలు, ఎస్‌ఈ స్థాయిలో కోటి రూపాయలు, ఈసీ స్థాయిలో రూ.2 కోట్ల వరకు టెండర్లు ఆమోదించే అధికారం కట్టబెట్టామని తెలిపారు. చర్చ అనంతరం పలువురి ప్రశ్నలకు టెలిఫోన్ ద్వారా మంత్రి హరీశ్ సమాధానాలిచ్చారు. ప్రజాగాయకుడు గద్దర్ కూడా ఫోన్ చేసినవారిలో ఉన్నారు.

నా వంతు సహకారం అందిస్తా: ప్రజా గాయకుడు గద్దర్
చెరువుల పునరుద్ధరణకు నా వంతు సహకారం అందిస్తాను. మా ఊళ్లో చెరువు నిండితే మా అమ్మ ఎంతో ఆనందపడేది. చెరువులు బాగుంటే రైతు ఆత్మహత్యలు ఉండవు. వలసలు, కరువులు ఉండవు. అంతకంటే ఆనందం ఏమి కావాలె? ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యక్రమం నిజంగా చాలా మంచిది. పాలకపక్షం, ప్రజలపక్షం, ప్రతిపక్షం అని ఉంటాయి. నేను ప్రజలపక్షం. ప్రజలకు మంచిచేసే పనులకు అండగా ఉంటాను. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో నేను శ్రమదానం చేస్తాను అని గద్దర్ చెప్పారు. ఇందుకు మంత్రి హరీశ్ స్పందిస్తూ.. గద్దర్ అన్నా.. మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిజాయితీగా, చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని మాట ఇస్తున్న. మీలాంటి వారు మాతో కలిసి రావడం ఎంతో సంతోషం అన్నారు.

శ్రీధర్, పాల్వంచ: పాల్వంచలో చెరువులు పూర్తిగా పాడయ్యాయి. చెరువుల పునరుద్ధరణ ప్రజల భాగస్వామ్యంతో చేస్తారా? లేక కాంట్రాక్టర్లతో చేస్తారా?
మంత్రి: చెరువు పునరుద్ధరణ ప్రభుత్వమే చేస్తుంది. పూడిక మట్టి కొట్టినప్పుడు రైతుల సహకారం అవసరం. నర్సాపూర్‌లో స్థానిక విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి పూడికమట్టి తీయడంలో సహకరించారు. ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ముందుకు వచ్చిన వారిని భాగస్వామ్యం చేస్తాం.

ప్రజా కవి గోరేటి వెంకన్న: చెరువుల పునరుద్ధరణ మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమంతో గ్రామీణ జీవితం మారుతుంది. గ్రామంలోని అన్ని కులాలకు ఉపాధి దొరుకుతుంది. ఇందులో నా వంతు పాత్ర పోషిస్తా.

మంత్రి: అన్నా నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ మాట, పాట చాలా గొప్పది. ఇప్పుడు చెరువుల పునరుద్ధరణలోనూ మీ పాత్ర ఉండాలన్నా.

గ్రామానికి చెరువు జీవనాధారం
మనిషికి నీరు ప్రాణాధారం-గ్రామానికి చెరువు జీవనాధారం. చెరువుల పునరుద్ధరణ అంటే కరువుపై పోరాటం. చెరువుల పునరుద్ధరణ అంటే రైతు ఆత్మహత్యలను ఆపడం. చెరువుల పునరుద్ధరణవల్ల నీటి లభ్యత పెరుగుతుంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది అని మంత్రి చెప్పారు. ఒకే సంవత్సరం అన్ని చెరువులను పునరుద్ధరించడం సాధ్యంకాదు కాబట్టి, ఏడాదికి 20% చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వివరించారు.

గతంలో ఆంధ్రాపాలకుల హయంలో ప్రపంచ బ్యాంకు, ఆర్‌ఆర్‌ఆర్ నిధులతో కొన్ని పనులు జరిగిన్పటికీ, కేవలం కట్ట, అలుగు, తూము బాగు చేయడంతోనే సరిపోయిందని ఆరోపించారు. ఇన్నేండ్లలో ఒక్క నాడుకూడా ఒక్క చెరువులో కూడా తట్ట పూడిక తీసిన పాపాన పోలేదని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు.

ఇక మైనర్ ఇరిగేషన్ విషయానికి వస్తే తెలంగాణ పట్ల ఎంత పక్షపాతంగా వ్యవహరించారో అర్థమవుతూనే ఉందన్నారు. 500 చెరువులు ఉన్న గుంటూరు జిల్లాకి ఒక ఎస్‌ఈ ఉన్నాడు. 400 చెరువులు ఉన్న కృష్ణాజిల్లాకు ఒక ఎస్‌ఈ ఉన్నాడు. అదే 7,500 చెరువులు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు ఎస్‌ఈ లేరు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్.. నాలుగు జిల్లాలకు కలిపి ఒక ఎస్‌ఈ మాత్రమే ఉన్నారు. ఆయన ఒక్కరే 16 వేల చెరువులను పర్యవేక్షించేవారంటే పరిస్థితి ఎంత దారుణమైందో అర్థం చేసుకోవచ్చు. నల్లగొండ జిల్లాకు ఒక్క ఈఈ మాత్రమే. కరీంనగర్ జిల్లాకు ఎస్‌ఈ లేరు. ఆదిలాబాద్ జిల్లాను పర్యవేక్షిస్తూ నిర్మల్‌లో ఉండే ఎస్‌ఈనే కరీంనగర్ జిల్లాను కూడా పర్యవేక్షించేవారు అని చెప్పారు.

పరిస్థితి ఇంత ఘోరంగా ఉండడంతో, మిషన్ కాకతీయను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక ఎస్‌ఈని నియమించాం. రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒక ఈఈని, ప్రతి మండలానికి ఒక ఏఈని నియమించాం. మైనర్ ఇరిగేషన్‌లో కృష్ణా విభాగానికి ఒక చీఫ్ ఇంజినీర్, గోదావరి విభాగానికి మరో చీఫ్ ఇంజినీర్‌ను ఏర్పాటు చేశాం. టెండర్ల వ్యవస్థలో అధికారాలను వికేంద్రీకరించాం. 95% మేర టెండర్ల ప్రక్రియ సీఈ స్థాయిలోనే పూర్తి అయ్యేలా నిబంధనలను సరళీకరించాం అని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *