గత రెండు దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ అవసాన దశలోకి అడుగుపెట్టినట్టే కనపడుతున్నది. తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసిన పాపానికి ఈ ప్రాంతంలో ఉనికే ప్రశ్నార్ధకమైంది. ఇక ఇప్పుడు జగన్ సునామీ ధాటికి అటు సీమాంధ్రలో కూడా వణికిపోతున్నది తెలుగుదేశం పార్టీ.
గత రెండేళ్లుగా పార్టీని వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల జాబితా చూస్తే టీడీపీ ఖేల్ ఖతం అయ్యిందని, ఇక దుక్నం బంద్ అయ్యే రోజు దగ్గరలోనే ఉన్నదని అనిపిస్తున్నది.
డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రకటన రాగానే చంద్రబాబు అర్ధరాత్రి మంత్రాంగం నడిపి బూటకపు రాజీనామాల ఎత్తుగడలతో ఒక కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లేవదీశాడు. దీనితో తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ అంటేనే ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చింది.
తమ నాయకుని యూ-టర్న్ తో ఆగ్రహించిన వేములవాడ తెదేపా శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు. అప్పటినుండి తెలంగాణ ప్రాంతంలో ఒక్కరొక్కరుగా ఎమ్మెల్యేలు పార్టీని వదిలివెళ్తూనే ఉన్నారు.
పార్టీలో నెంబర్ 2 గా ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి బయటికి వెళ్లి తెలంగాణపై చంద్రబాబు వైఖరిని తూర్పారపడుతున్నాడు.
బాన్స్ వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలంగాణ అంశంపై పార్టీని వీడగా, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే వేణుగోపాలా చారి పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఇక సీమాంధ్ర ప్రాంతంలో జగన్ ధాటికి తెలుగుదేశం తుఫానులో చిక్కుకున్న నావలా గజగజలాడుతుంది. మొదట నెల్లూరు జిల్లా కోవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరగా మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు గద్దె బాబూ రావు పార్టీని వీడారు.
ఇక ఫైర్ బ్రాండ్ నన్నపనేని రాజకుమారి, రాజ్యసభ సభ్యుడు మైసూరారెడ్డి వంటి వారు తమ కుటుంబ సభ్యులను జగన్ పార్టీలోకి పంపించి అల్రెడీ బెర్తును రిజర్వు చేసుకుంటున్నారు.
తనకు రాజ్యసభ బెర్త్ రాకపోవడంతో కినిసిన సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా జగన్ పార్టీలోకి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
మొన్న విజయవాడలో జగన్ ను రోడ్డు మీద కలిసినందుకు విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి గంటల వ్యవధిలోనే షోకాజ్ నోటిస్ ఇచ్చి తాను ఎంత వణికిపోతున్నాడో చంద్రబాబు చెప్పకనే చెప్పాడు. తెలుగుదేశం దయనీయ స్థితి చూసిన జగన్ ఇంకొంచెం దూకుడు చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతున్న సినీ నటుడు మోహన్ బాబును జగన్ కలవడం ఈ మైండ్ గేములో భాగమే.
నిన్న వరంగల్ జిల్లాకు చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ సంబారి సమ్మారావు పార్టీని వీడగా మరో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధినాయకునిపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయకత్వంపై తెలుగు తమ్ముళ్లకు భ్రమలు వీడుతున్నాయని, తెదేపా మునిగే పడవ అని తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కరొక్కరుగా జంప్ అవుతున్నారని అర్థం అవుతుంది.